కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనిఅధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ ప్రస్తుతం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే.. ఆయనను పదిహేను రోజుల వ్యవధిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి భేటీ కావడం సంచలనంగా మారింది. గతంలో ఒకసారి కలిసిన ఆమె పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారంటూ.. డీకేను అభినందించింది. ఈ సందర్భంగా అన్నయ్యా! అంటూ షర్మిల చేసిన ట్వీట్.. రాజకీయంగా చర్చకు వచ్చింది.
ఇక, ఆ తర్వాత.. తాజాగా సోమవారం షర్మిల మరోసారి డీకేను కలిసి అభినందించారు. ఇప్పుడు డీకే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఇంటికి నేరుగా వెళ్లిన షర్మిల.. ఆయనతో కలిసి విందు ఆరగించారని తెలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా షర్మిల డీకే శివకుమార్‌తో మాట్లాడుతూ.. “పార్టీ పరంగా మీరు ఎంతో కష్టించారు. కష్టాల్లో ఉన్న పార్టీని బతికించుకునేందుకు ఎన్నో రూపాల్లో ప్రయత్నం చేశారు. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం లభించింది“ అని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలో అంతర్లీనంగా తన అన్న.. ఏపీసీఎం జగన్‌పై పరోక్ష విమర్శ దాగి ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు.. అంటే.. ప్రస్తుత సీఎం జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు షర్మిల అన్నీ తానై.. జగనన్న బాణాన్ని అంటూ.. రాజకీయ రంగ ప్రవేశం చేసి పాదయాత్ర ద్వారా.. వైసీపీ శ్రేణులు కదల బారకుండా.. చూసు కున్నారు. దీంతో జగన్ జైల్లో ఉన్నప్పటికీ 16 నెలల పాటు.. పార్టీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇక, 2019 ఎన్నికలకు ముందు కూడా.. ఆమె ప్రచారం చేశారు.
ఊరూవాడా తిరిగి..ఏపీలో ప్రచారం చేసి.. ఒక్క ఛాన్స్ జగనన్నకు ఇవ్వాలని ప్రజలను కోరారు. అనుకున్న విధంగానే జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. ఇంతగా పార్టీ కోసం కష్టించి.. జగన్ జైల్లో ఉన్నా.. తాను జగనన్న బాణాన్ని అంటూ.. ప్రజల మద్య తిరిగిన షర్మిలకు కనీసం జగన్ ప్రాధాన్యంఇవ్వకపోగా.. రాజ్యసభ సీటును కూడా తిరస్కరించారు. దీంతో ఆమె పొరుగు రాష్ట్రానికి వెళ్లి పార్టీ పెట్టుకున్నారు. తాజాగా డీకే తో షర్మిల చేసిన సంభాషణ నేపథ్యంలో “తగిన ఫలితం దక్కింది“ అన్న షర్మిల కామెంట్ వెనుక.. జగన్ తనను బాధ పెట్టిన వైనంపై ఆవేదన ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.