టీడీపీ అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 100రోజుల పాదయాత్రను పూర్తి చేసుకున్న లోకేష్ కడపలో పాదయాత్ర మొదలుపెట్టారు. సీఎం జగన్ సొంత ఇలాకాలో లోకేష్ పాదయాత్ర జరగబోతున్నడంతో అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న రీతిలో మాటల యుద్ధానికి ఇరు పార్టీల నేతలు తెర తీశారు.
ప్రస్తుతం జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్ద పసుపుల గ్రామాలలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ కు ఆ గ్రామాలకు చెందిన దళితులు, మైనారిటీలు, రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ సమస్యలను లోకేష్ కు వారంతా మొర పెట్టుకున్నారు. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సమస్యలతోపాటు అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.
గ్రామీణాభివృద్ధిని జగన్ పూర్తిగా గాలికొదిలేశారని, గ్రామాలకు నిధులివ్వకపోగా, గ్రామ పంచాయతీల్లోని రూ.8,660 కోట్లను సర్పంచ్ లకు తెలియకుండా దొంగిలించారని ఆరోపించారు. జగన్ పాలనలో పేదలు, దళితుల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయని, దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. జగన్ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో ఆరోగ్య రంగం కుప్పకూలిందని, కర్నూలు, అనంతపురం వంటి పెద్దాసుపత్రుల్లో సైతం కనీసం దూది, గాజుగుడ్డలేని దుస్థితి ఉందని ఆరోపించారు.
మరోవైపు, లోకేష్ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించనున్నారు. రాజమండ్రిలో ఈ నెల 27, 28వ తేదీలలో ప్రతినిధుల సభతో పాటు టీడీపీ మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈ నెల 30వ తేదీన తన పాదయాత్రను లోకేష్ మళ్లీ ప్రారంభించబోతున్నారు. జమ్మలమడుగులో పాదయాత్ర ముగించిన లోకేష్ అక్కడ నుంచి కడప ఎయిర్ పోర్టుకు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి లోకేష్ చేరుకోనున్నారు. రేపు అమరావతి నుంచి రాజమండ్రి చేరుకొని మహానాడులో లోకేష్ పాల్గొనబోతున్నారు.