వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ జరిపేందుకు కర్నూల్ లో అవినాష్ తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డికి సంబంధించిన వార్తలు కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు ఉత్సాహం చూపించారు. అయితే, ఆ సందర్భంగా అవినాష్ రెడ్డి అనుచరులు కొందరు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, మాజీ జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
ఆ దాడిని ఖండించాల్సిన సజ్జల..మీడియా ప్రతినిధులను తప్పుబట్టారు. అవినాష్ వ్యవహారంలో ఎల్లో మీడియావి రోత రాతలని, అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తన తల్లికి బాగోలేదని అవినాష్ చెబుతుంటే డ్రామాలాడుతున్నారని వార్తలు రాస్తున్నారని, అవి చూసినప్పుడు కొందరు అభిమానులు కడుపు మండి ఆగ్రహానికి గురవుతున్నారని దాడి చేసిన వారిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అవినాష్ ఆరేడు సార్లు విచారణకు హాజరయ్యారని, పారిపోలేదని అన్నారు. పోలీసులతో మాట్లాడి సీబీఐ అధికారులు వారి పని వారు చేసుకుంటారు అని చెప్పారు. వైసీపీకి ఎవరూ లేరనుకోవద్దని, కోట్లాదిమంది కార్యకర్తలు, అభిమానులు ఉన్నారని అన్నారు. అవినాష్ రెడ్డి వెంట పడాల్సిన అవసరం మీడియాకు ఏంటని, ఆయన అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వచ్చారా అని ప్రశ్నించారు. ఆ రీతిలో వార్తలు రాస్తే అభిమానులు రియాక్ట్ అయ్యి దాడి చేసి ఉంటారని సమర్థించుకున్నారు.
అవినాష్ రెడ్డి అడిగినట్టుగా నాలుగు రోజులు టైం ఇస్తే ఏమవుతుందని, అప్పటికి రాకపోతే అరెస్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. తాజాగా సజ్జల వ్యాఖ్యలు చూస్తుంటే వైసీపీ అభిమానులు, కార్యకర్తలను రెచ్చగొట్టినట్టుగా ఉందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పాత్రికేయుడిగా పని చేసిన సజ్జల మీడియా మిత్రులపై దాడిని ఖండించాల్సింది పోయి దాడి చేసిన వారిని సమర్థించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.