వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ వ్యవహారంలో హై డ్రామా నడుస్తోన్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరుకాకుండా తన తల్లి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే, ఆసుపత్రి దగ్గరకు సీబీఐ అధికారులు చేరుకోవడంతో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.
సీబీఐ, కేేంద్రం గతంలోలా లేవని, ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నాయని రఘరామ అన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని జోస్యం చెప్పారు. మచిలీపట్నం పర్యటనలో ఉన్న జగన్ తాడేపల్లికి చేరుకున్న తర్వాత అవినాష్ అరెస్ట్ ఉంటుందని అన్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి అనారోగ్యానికో, గుండెజబ్బు, హార్ట్ ఆపరేషన్ అంటూ 10 మంది డాక్టర్లు, 10 మంది యాక్టర్లు ఏదైనా డ్రామా చేస్తే అరెస్ట్ ఆగిపోవచ్చని అన్నారు.
సీబీఐ అరెస్ట్ చేస్తుందని అవినాశ్ భయపడుతున్నారని అంతా భావిస్తున్నారని, కానీ, అసలు భయపడుతోంది జగన్ అని రఘురామ చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన అవినాశ్ ను కడపకు వెళ్లిపో, పులివెందులకు వెళ్లిపో అని జగన్ చెప్పారని ఆరోపించారు. అవినాష్ అరెస్టుకు సీబీఐ సిద్ధమైందని, కానీ, ఏపీ డీఐజీ, ఏపీ పోలీసులు చాలా చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు ఆసుపత్రి దగ్గర 10 మంది ఆకు రౌడీలను అరెస్ట్ చేయలేరా? అని ప్రశ్నించారు.
తమలాంటి వాళ్లను వేసుకెళ్లడానికే ఈ పోలీసులు ఉన్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రంలోగా అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమని చెప్పారు. అవినాశ్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కర్నూలు ఎస్పీ, డీఐజీ వంటి అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలని రఘరామ డిమాండ్ చేశారు.