ఏమాటకు ఆ మాటే చెప్పాలి. టాలీవుడ్ లోని ప్రముఖుల్లో పలువురు భారీ ఖర్చుకు పెద్దగా వెనుకాడరనే చెప్పాలి. ఖరీదైన కార్లు.. వాచీల్ని విపరీతంగా ఇష్టపడే ఇప్పటితరానికి సూట్ అయ్యేలా వారి తీరు ఉంటుంది. ఈ మధ్య కాలంలో కోట్ల ఖర్చుతో కొత్త తరహా కార్లను వినియోగిస్తున్నటాలీవుడ్ ప్రముఖులు చాలామందే కనిపిస్తారు.
తాజాగా ఆ జాబితాలో చేరారు డార్లింగ్ ప్రభాస్. బాహుబలి మూవీతో అతడి రేంజ్ భారీగా పెరిగిపోగా.. సాహో డిజాస్టర్ ఆయన స్పీడ్ ను తగ్గించలేకపోయింది. తాజాగా ఆయన చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియావే కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఆదివారం ప్రభాస్ ఎంతో ముచ్చటగా కొనుకున్న లగ్జరీ కారు ఇంటికి వచ్చి చేరింది.
ప్రభాస్ కలెక్షన్ లో ఇప్పటికే బోలడన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిని మించి అన్నట్లుగా ఆయన కొత్త కారు ఉందని చెబుతున్నారు. లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్ స్టర్ కారును కొనుగోలు చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కారు ఆదివారం ప్రభాస్ ఇంటికి చేరినట్లు తెలుస్తోంది. ఈ కారు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. దీని ధర ఇస్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ కారు విలువ ఏకంగా ఏడుకోట్ల రూపాయిలుగా చెబుతున్నారు.
ప్రభాస్ వద్ద ఇప్పటికే బీఎమ్ డబ్ల్యూ 520డి, ఇన్నోవా క్రిస్టా.. జగ్వార్ ఎక్స్ జేఎల్.. రేంజ్ రోవర్ వోగ్.. రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు ఉన్నట్లు చెబుతారు. వీటికి జతగా కొత్తగా కొన్న లంబోర్గి వచ్చి చేరినట్లు చెప్పాలి. మరి.. ఈ ఖరీదైన కారులో ప్రభాస్ ఎప్పుడు కనిపిస్తారో చూడాలి.