అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఓ ఉన్మాది జరిపిన కాల్పులలో హైదరాబాద్ లోని సరూర్ నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) దుర్మరణం పాలైన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తున్న ఐశ్యర్యపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఆ సైకో తూటాలకు అమెరికాలో స్థిరపడిన తమ కుమార్తె బలికావడంతో ఐశ్వర్య తల్లిదండ్రులు నర్సిరెడ్డి, అరుణ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అయితే, ఐశ్వర్యను దుండగుడు ఎంత కిరాతకంగా చంపాడన్న విషయం ఇపుడు మరింత సంచలనం రేపుతోంది. బుల్లెట్ల దాడికి ఐశ్వర్య మొఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటే ఆమె చనిపోయే ముందు ఎంత నరకయాతన అనుభవించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఐశ్వర్య పాస్ పోర్టు, వేలిముద్రలను పరీక్షించిన తర్వాతే చనిపోయింది ఐశ్వర్యేనని ఎఫ్ బీఐ నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ‘తానా’ కోశాధికారి అశోక్ కొల్లా ఆమె తల్లిదండ్రులకు ఐశ్వర్య మరణవార్తను చేరవేశారు.
టెక్సాస్ లోని అలెన్ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్లో దుండగుడు హఠాత్తుగా కాల్పులకు తెగబడిన ఘటన అమెరికాలో కలకలం రేపింది. కారులో మాల్ దగ్గరకు వచ్చిన ఉన్మాది…అక్కడున్న వారిపై ఇష్టారీతిన కాల్పులు జరిపాడు. ఆ ఘటనతో ఉలిక్కిపడ్డ జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటనలో 8 మంది మరణించగా చాలామంది గాయాలపాలయ్యారు.
సకాలంలో స్పందించిన పోలీసు అధికారి…నిందితుడిపై ఎదురు కాల్పులు జరిపి అతడిని మట్టుబెట్టకుంటే ఇంకా ప్రాణనష్టం జరిగి ఉండేది. ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి ఐశ్వర్య మృతదేహం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుందని తెలుస్తోంది.