తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో విజయం దక్కించుకుందామని… రాష్ట్ర బీజేపీ చీఫ్.. సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా బీజేపీలో ఉండడం.. ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉ న్న నాయకుడిగా ఆయనకు ప్రత్యేకత ఉన్న నేపథ్యంలో తన హయాంలో రాష్ట్రంలో బీజేపీని పరుగు పెట్టిం చాలని ఆయన భావిస్తున్నారు.
అయితే. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఘోరంగా పార్టీ ఓటమిపాలైంది. గట్టి నాయకులు, మంచి కేడర్ ఉన్న విశాఖలోనే పార్టీ పత్తాలేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇక, ఇప్పుడు తిరుపతిలో అయినా.. సత్తా చాటకపోతే.. తన పదవికి, తనకు కూడా ఎసరు ఖాయమని వీర్రాజు వర్రీకి గురవుతున్నారు.
ఈ క్రమంలోనే తిరుపతి పార్లమెంటు ఉప పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. కానీ, ఆయనకు ఇక్కడ కూడా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు తిరుపతిని మేమే అభివృద్ధి చేశాం.. చంద్రబాబు కానీ, జగన్ కానీ.. కేంద్రంలోనని బీజేపీ ఇచ్చిన నిధులతోనే ఇక్కడ పనులు చేశారని చెప్పుకొచ్చిన వీర్రాజుకు.. ఇప్పుడు ఇదే తిరుపతి ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలు దిమ్మతిరిగేలా చేస్తున్నాయి.
ప్రధానంగా నాలుగు అంశాలను ఇక్కడి ప్రజలు తెరమీదికి తెస్తున్నారు.. `తిరుపతి పార్లమెంటరీ పీపుల్` పేరుతో ఏర్పడిన మేధావి వర్గం… బీజేపీ నేతలకు ఈ ప్రశ్నలు సంధిస్తుండడం గమనార్హం.
స్మార్ట్ సిటీ: కేంద్రంలో వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్న సమయంలో.. బీజేపీ ప్రభుత్వం తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించింది. అదే సమయంలో ఈ సిటీలోని అత్యంత కీలకమైన గరుడ ఫ్లైఓవర్‌కు మాత్రం కేంద్ర బడ్జెట్ నుంచి పైసా ఇవ్వలేదు. వెంకటేశ్వర స్వామి హుండీ సొమ్ము నుంచే ఇందుకయ్యే వ్యయం పెట్టుకోవాల్సి వస్తోంది. మరి దీనిపై ఏమంటారనేది ఇక్కడ మేధావుల ప్రశ్న.
రహదారుల విస్తరణ: ప్రపంచ ప్రసిద్ధ తిరుమల క్షేత్రం ఉన్న తిరుపతిలో రహదారులు కుంచించుకుపోయాయి. వీటిని విస్తరించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనిలో రెండు జాతీయ రహదారులు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు బీజేపీ నేతలు ఈ విషయంపై నోరు మెదపడం లేదు.
శేషాచలం: ప్రపంచంలో ఎర్రచందనం లభించే అటవీ ప్రాంతం ఏకైక శేషాచలం. ఇది కూడా తిరుమల పరిధిలోనే ఉంది. ఎర్రచందనానికి రక్షణ కల్పించాలని ఎన్నాళ్లుగానో.. డిమాండ్ ఉంది. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కూడా అనేక విజ్ఞప్తులు అందాయి. కానీ, ఇప్పటికీ ఈ సమస్యను పరిష్కరించలేదు.
అంతర్జాతీయ స్థాయి ఎప్పుడు?
తిరుపతి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయికి తెస్తామని చెప్పి ఇప్పటికి ఏడేళ్లు గడిచాయి. నెలకు నలుగురు కేంద్ర మంత్రులు తిరుపతికి వస్తున్నారు. స్వామిని దర్శించుకొని వెళుతున్నారు. కానీ, కనీసం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఇవ్వలేదు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయమని జీవీఎల్ పదే పదే చెబుతున్నారు.
కానీ, ఒక్క విమానమైనా విదేశాల నుంచి వాలడంలేదు. దేశంలో ఎక్కడాలేని విధంగా తిరుపతికి హోటల్ మేనేజ్ మెంట్ విశ్వవిద్యాలయం కేటాయించారు. కానీ, ఇంతవరకు ప్రాథమిక సన్నాహాలే మొదలుకాలేదు. తిరుపతి ఐఐటీ కల కూడా సాకారం కాలేదు. ఐఐటీకి సొంత భవనమే ఇంతవరకు ఏర్పాటుచేయలేకపోయారు.
నిధులు వెనక్కి…!
వెనుక బడిన రాయలసీమ జిల్లాలకు ఇచ్చిన నిధులు కేంద్రం వెనక్కి తీసుకొంది. పోనీ అవినీతి గురించి మాట్లాడదామా.? అంటే ఇటీవల ఒక ఆశ్రమానికి సంబంధించిన కోట్లాది రూపాయల డీల్‌లో ఇద్దరు బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు కేంద్రానికి ఫిర్యాదులు అందిన విషయం వెలుగులోకి రావడంతో నోట మాట రావడం లేదు.
ఇలా మొత్తంగా .. వీర్రాజుకు తిరుపతిలో వర్రీలు చాలానే ఉన్నాయని అంటున్నారు తిరుపతి మేధావుల సంఘం నాయకులు. మరి వీటిని తట్టుకుని ఆయన ఎలా గెలుపు గుర్రం ఎక్కుతారో చూడాలి.