టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన పుట్టినరోజునాడు ఒక కీలక పథకాన్ని ప్రకటిస్తానని చెప్పారు. దీంతో చంద్రబాబు పుట్టిన రోజు.. ఆయన ప్రకటించే పథకంపై పెద్ద ఎత్తున అంచనాలు పెరిగిపోయాయి.
ఇక, గురువారం రాత్రి చంద్రబాబు వేలాది మంది మార్కాపురం ప్రజల సమక్షంలో తన డ్రీమ్ ప్రాజెక్టును ప్రకటించారు. అదే సైద్ధాంతిక భావన(ఐడియాలజీ కాన్సెప్టు).
ఇంతకీఏంటి ఈ .. ఐడియాలజీ కాన్సెప్టు? అంటే.. పేద కుంటుంబాలను.. వచ్చే 15-20 ఏళ్లలో ఆర్థికంగా పుంజుకునేలా చేయడమే. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్నీ సంపన్నులుగా తయారు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ఈ ఐడియాలజీ కాన్సెప్టు పనిచేస్తుం దని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రెండు అంశాలపై సంకల్పం తీసుకున్నారు.
‘మొదటిది.. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా.. ఏరంగంలో ఉన్నా.. నంబర్ వన్ స్థానంలో నిలవాలి. తెలుగు ప్రజల్లో ఉండే పేదవారు కోటీశ్వరులు కావడం రెండో సంకల్పం.
అనుభవం, విజన్, టెక్నాలజీ వినియోగం, సంపన్నులు తోటివారికి తోడ్పడడం ద్వారా, ప్రజల మద్దతుతో వీటిని సాకారం చేసుకోవచ్చు’ అనేది చంద్రబాబు ఆలోచన.
ఐడియాలజీ కాన్సెప్టు ద్వారా ఇది సాకారం అవుతుందని చంద్రబాబు వివరించారు.
సంపద సృష్టించి దానిని అందరికీ సమానంగా పంచాలన్నదే తన ఆలోచనగా చంద్రబాబు పేర్కొనడం విశేషం.
‘నేను చేసే పనులు, నా ఆలోచనలు నా కోసం కాదు.. ప్రజల బాగు, వారి భవిష్యత్ కోసమే.
విజన్-2020 వల్లే హైదరాబాద్ నేడు ధనికులు ఎక్కువగా ఉన్న నగరాల సరసన 65వ స్థానంలో నిలిచింది’ అని పేర్కొన్నారు.
గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా సొంత గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామని.. ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ద్వారా ప్రజల జీవితాలను సమూలంగా మార్చవచ్చని తెలిపారు.