‘నమస్తే ఆంధ్ర’ ముందే చెప్పినట్లుగా గత ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస గోగినేని నాయకత్వంలో ‘టీం గోగినేని’ మరియు గత బోర్డు చైర్మన్ నరేన్ కొడాలి నాయకత్వంలో ‘టీం కొడాలి’ పూర్తిస్థాయి ప్యానెల్స్ తో ముఖాముఖి తలపడుతున్నాయి.
నామినేషన్ల ప్రక్రియ పూర్తయి ప్రచారం ఊపందుకునే సమయంలో కోర్టు వద్ద పెండింగ్ లో ఉన్న విషయంలో వచ్చిన తాత్కాలిక విరామం లో రెండు వర్గాలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ వర్గాల మధ్య ఉన్న తీవ్ర బేదాభిప్రాయాల మూలముగా, ‘తానా’ సంస్థ పై ఆధిపత్య పోరాటం కారణంగా ఇది పెను తుఫాను ముందు కనిపించే ప్రశాంతత గా పలువురు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో బలమైన ‘జయ్ తాళ్లూరి’ వర్గంతో అట్లాంటా ‘లావు బ్రదర్స్’ వర్గం కూడా కలసి అప్పటివరకు తిరుగులేని విధంగా అధికారం చెలాయిస్తూ ఉన్న ‘త్రిమూర్తుల’ వర్గాన్ని ఓడించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ‘జయ్ తాళ్లూరి’ వర్గానికి ‘లావు బ్రదర్స్’ వర్గానికి వచ్చిన విభేదాలు క్రమంగా తారాస్థాయికి చేరి అవి ప్రస్తుత ఎన్నికలలో చూపించబోయే తీవ్ర ప్రభావం మూలంగా ‘తానా’ సంస్థ భవిష్యత్తును నిర్దేశించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ పరిణామ క్రమం పరిశీలిస్తే క్రింది విషయాలు అర్ధమవుతాయి.
విభేదాలు పొడచూపిన వెంటనే సంస్థ ప్రయోజనాల కంటే స్వంత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం గా భావించే ‘లావు బ్రదర్స్’ వర్గం తాము ప్రస్తుతం అధికారంలో ఉన్న దాన్ని అవకాశంగా వాడుకుంటూ పావులను వేగంగా కదిపింది.
అధికారంలో ఉన్నప్పుడు చేతిలో ఉండే పదవులను ఎరగా వాడుకుని అప్పటికే బలహీనపడి ఉన్న ‘త్రిమూర్తుల’ వర్గంలోని పదవీ కాంక్ష ఉన్న వారిని క్రమక్రమంగా తమ వైపుకు ఆకర్షించింది.
అనేక కమిటీ పదవులతో పాటు, ‘తానా’ ఫౌండేషన్, టీం స్క్వేర్, చైతన్య స్రవంతి వగైరా కారక్రమాల్లో ఇదే పంథా అవలంబించారు.
ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన ‘తానా’ కాన్ఫరెన్స్ ను కూడా తమ అడ్డా అని చెప్పుకునే అట్లాంటాలో కాకుండా డేట్లు దొరకలేదు అనే ‘కుంటి సాకు’ చెబుతూ ఎక్కడో దూరంగా ఉన్న ఫిలడెల్ఫియా లో అదీ జులై రెండో వారంలో జరపడాన్ని అనేకమంది సభ్యులు ముఖ్యంగా ‘అట్లాంటా వాసులు’ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ సందులో గతంలో ఓటమి పాలైన నరేన్ కొడాలి కొంత విరామం తర్వాత జూలు విదిల్చి, ఎన్నికల ప్రయోజనాలను ఆశిస్తూ నిధులు సమకూరుస్తూ అట్టహాసంగా కొత్త సభ్యులను చేర్పించడం మొదలు పెట్టారు.
ఆ కబురందగానే మిగతా రెండు వర్గాలు వెనుక పడతామేమో అనే ఆందోళనలో పోటీలుపడి మొత్తం సభ్యులను ఒక్క నెలలో రెట్టింపు చేశారు.
ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎవరు ఎవరి ద్వారా ఎన్నెన్ని చేర్చారో, క్షేత్రస్థాయిలో చేర్చిన వారు ఇప్పుడు ఎవరు ఎవరితో కలసి ఉన్నారో, ఇంకా చేరిన వారు ఎంతమంది అడ్రస్ మారారో, వారి మీద ఎంత కంట్రోల్ ఉందొ కూడా తెలియక అందరూ గందరగోళ పడుతున్నారు.
ఇంతకూ అందరూ కలిసి 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి చేర్పించిన సభ్యులకు ఓటు హక్కు కల్పించే ప్రక్రియలో జరిగిన అలసత్వం కారణంగా ఈ ఎన్నికలకు గాక తరువాయి ఎన్నికలతోనే ఓటు వచ్చే పరిస్థితి కలిగింది.
సత్వర ఎన్నికల ప్రయోజనాన్ని ఆశించి ధనాన్ని వెచ్చించి చేర్పించిన సభ్యులకు వెంటనే ఓటు హక్కు రాకపోయే విషయాన్ని జీర్ణించుకోలేని వర్గాలు తమ మూకుమ్మడి వైఫల్యాన్ని ఎదుటివారికి ఆపాదించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కొత్త సభ్యుల మూలంగా అధిక ప్రయోజనాలు ఆశించిన నరేన్ కొడాలి తీవ్ర నిరాశకు లోనై న్యాయ వ్యవస్థ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ సందులో పరిస్థితులను బేరీజు వేస్తూ అమెరికా వ్యాప్తంగా ఉన్న అనేక వర్గాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పునరేకీకరణ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అప్పటికే బలహీనపడిన ‘త్రిమూర్తుల’ వర్గానికి ఉన్న అనివార్య పరిస్థుతులను అనువుగా మలుచుకున్న లావు బ్రదర్స్ వర్గం రాజకీయ విలీనాన్ని ప్రతిపాదించి ఆమోదాన్ని పొంది కొడాలి-లావు వర్గంగా ఏర్పడ్డారు.
ఈ విలీన ప్రయత్నాన్ని నిరసించిన అనేకమంది ఈ రెండు వర్గాల నుంచి ముఖ్యంగా డాలస్, బే ఏరియా, న్యూ జెర్సీ వగైరా ల నుంచి జయ్ తాళ్లూరి వర్గం వైపు దృష్టి సారించారు.
కుదురుగా ఒక్కటి గా ఉంటున్నందున, వివాదాస్పద నాయకత్వం కానందున మరియు వర్గానికి చెందిన నిరంజన్ శృంగవరపు కాబోయే అధ్యక్షుడైనందునా అనేకమంది తటస్థులు, సీనియర్లు కూడా ఈ వర్గం వైపు సానుభూతి చూపారు.
ఇక నరేన్-లావు వర్గం తమ రెండు వర్గాల కలయిక అంటే ఇక నల్లేరు మీద నడకే ‘విజయం మనదే’ అంటూ కొద్దికాలం ఎగిరెగిరిపడినా ఇల్లలకగానే పండగ కాదనే విషయం బోధపడే నాటికి ‘జయ్ తాళ్లూరి’ వర్గం ధీటుగా ఎదురు నిలిచింది.
కాళ్ళ కిందకు నీరు వచ్చిందని తెలిసిన వెంటనే దిద్దుబాటు చర్యగా తమకు మొగ్గు ఉంటుందనుకుంటూ కొత్తగా చేరిన సభ్యులకు వోటు హక్కుకై పోరాటం అంటూ ద్విముఖ చర్యలకు ఉపక్రమించింది.
ఇటు ‘లావు వర్గం’ ప్రస్తుతం అధికారంలో ఉన్న కారణంగా సంస్థ కార్యవర్గాల లోపలి నుంచి అటు నరేన్ కొడాలి తన సన్నిహితుల ద్వారా కోర్టు కేసుల పరంగా ప్రయత్నాలు ముమ్మరం గా చేసారు.
పరిణితి లోపం కారణంగా సరిగా వ్యవహలించలేక కొంత, అతి ముఖ్యమైన ‘తానా’ బోర్డు లో ఆధిక్యత లోపించిన కారణంగా మరికొంత ‘లావు బ్రదర్స్’ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
అలాగే ‘తానా’ బై లాస్ లో ఉన్న స్పష్టత కారణంగా కోర్టు కేసులలోనూ నరేన్ ఇప్పటివరకు పెద్దగా ఫలితాన్ని తెచ్చుకోలేక పోయారు.
అప్పటివరకూ మధ్యస్థంగా ఉన్న ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ కూడా తాజా పరిణామాల మూలంగా ‘జయ్ తాళ్లూరి’ వర్గానికి సన్నిహితంగా మారారు.
ఈ లొగా ఎన్నికలకు సమయం రావడంతో ఆధిపత్య పోరాటంలో చివరి అధ్యాయం మొదలైంది.
ఇప్పటివరకు గుంభనంగా, నిలకడగా వ్యవహారం నడుపుతున్న ‘జయ్ తాళ్లూరి’ వర్గం అనేక తర్జన భర్జనలు, సంప్రదింపులు, సర్వేలు, విశ్లేషణ తదుపరి తమ వర్గం తరఫున తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా మద్దతును అత్యంత సీనియర్ నాయకుడు వివాదరహితుడు గత ఫౌండేషన్ చైర్మన్ ‘శ్రీనివాస గోగినేని’ ని ప్రకటిస్తూ, పూర్తి ప్యానెల్ నాయకత్వాన్ని ఇవ్వడం ‘తానా’ తెలుగు సమాజంలో సంచలనాన్ని అదే సమయంలో ప్రత్యర్థి వర్గం లో మొదటిసారి ఒకింత ఆందోళనను కలిగించింది.
కొనసాగింపుగా సాగిన ప్రక్రియలో ప్రకటించిన పూర్తి ప్యానెల్ లో ప్రస్తుత ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, అశోక్ కొల్లా, శ్రీనివాస్ ఉయ్యూరు, శిరీష తూనుగుంట్ల, మురళి తాళ్లూరి, రవి సామినేని, రజని ఆకురాతి, రజనీకాంత్ కాకర్ల తో పాటు అనేక మంది ప్రముఖులు ‘టీం గోగినేని’ ప్యానెల్ నుంచి పోటీ లో ఉన్నారు.
‘గోగినేని-తాళ్లూరి’ వర్గంలోని ముఖ్యుల మధ్యన ఉన్న సఖ్యత కారణంగా, తదుపరి అధ్యక్షుడైన ‘నిరంజన్ శృంగవరపు’ చేసిన విశేష కృషి మూలంగా ప్యానెల్ సభ్యుల ఎంపిక సజావుగా, సులభంగాను జరిగినట్లు తెలుస్తోంది.
పూర్తి ప్యానెల్ ని ముందుగా తేల్చుకుని తదుపరి వ్యూహాలకు వెంటనే పదునుపెడ్తున్న కారణంగా తుది ఎన్నికలకు తయారుగా ఉన్నట్లు తెలుస్తోంది
ఇక ‘నరేన్-లావు’ ల వర్గం ముందునుంచీ అనుకుంటున్నట్లు మాజీ బోర్డు చైర్మన్ నరేన్ కొడాలి తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన ప్పటికీ ఇందులో ఉన్న రెండు వర్గాల మధ్యన పంపకాల మూలంగా మిగతా సభ్యుల ఎంపికపై పై కొంత గందరగోళం అలాగే ఒకింత ఆలస్యం జరిగింది.
అనేక రకాల చర్చల అనంతరం ప్రకటించిన పూర్తిస్థాయి ప్యానెల్ ‘లావు బ్రదర్స్’ రాజకీయ మాయాజాలంనకు అర్ధం పట్టింది.
గత ఎన్నికల్లో నరేన్ కొడాలి తనతో పాటు పోరాడి ఓడిన రాజా సూరపనేని, సత్యనారాయణ మన్నే, అనిల్ ఉప్పలపాటి వంటి ఉద్దండులకు కూడా ప్యానెల్ లో చోటు కల్పించకపోగా, బోర్డు లోకి వచ్చే అన్ని పదవులు తమ వర్గం వారికి వచ్చే విధంగా ‘లావు బ్రదర్స్’ నడిపిన రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
ఈ ప్యానెల్ లో నరేన్ తో పాటు గా ప్రముఖ ‘తానా’ దాత ‘రవి మందలపు’, శ్రీనివాస్ లావు, రవి పొట్లూరి, ప్రసాద్ నల్లూరి, రాజా కసుకుర్తి, భరత్ మద్దినేని, హేమ కానూరు, భక్త బల్ల తో పాటు అనేక మంది ప్రముఖులు ఉన్నారు.
ప్యానెల్ కూర్పు పూర్తి అయి, ముందు నుంచి అనుకుంటున్న నరేన్ కొడాలి అభ్యర్థిగా కొనసాగుతున్నప్పటికీ కోర్టు కేసుల పరంగా ఉన్న వెసులుబాటుతో ఎన్నికలు వాయిదా పడటానికి మొగ్గు చూపుతున్నట్టు వినికిడి.
ఏదేమైనప్పటికీ ఇద్దరు ఉద్దండుల సారధ్యంలో రెండు పానెల్స్ ముఖాముఖీ తలపడే వచ్చే ఎన్నికల్లో ‘తానా’ చరిత్రలోనే ఓటర్ల సంఖ్యా పరంగాను, అభ్యర్థుల సంఖ్యాపరంగానే గాక, ప్రచార స్థాయిలోను రికార్డు సృష్టించవచ్చని చాల మంది అనుకుంటున్నారు.
నామినేషన్ల ప్రక్రియ పూర్తయి ప్రచారం ఊపందుకునే సమయంలో కోర్టు వద్ద పెండింగ్ లో ఉన్న కారణంగా వచ్చిన తాత్కాలిక విరామం లో రెండు వర్గాలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
శ్రీనివాస గోగినేని కి ‘తానా’ సభ్యుల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్ మరియు ఇంతకు ముందు చేసిన ఫౌండేషన్ చైర్మన్ పదవి తో పాటు ‘మన ఊరికోసం’ వంటి అనేక సేవా కార్యక్రమాల మూలంగా వచ్చిన గుర్తింపు తో పాటు ఫౌండేషన్ ప్రస్తుత చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ కు ఉన్న ‘ప్రత్యేక ఇమేజ్’, సెక్రటరీ అభ్యర్థి అశోక్ కొల్లా చేసిన విశిష్ట సేవలు, రవి సామినేని ఫాండషన్ ద్వారా చేసిన కార్యక్రమాలకు తోడు శిరీష తూనుగుంట్ల, శ్రీనివాస ఉయ్యురు, మురళి తాళ్లూరి, రజనీకాంత్ కాకర్ల తదితరులకు ఉన్న గుర్తింపు మూలంగానూ, గత అధ్యక్షులు జయ్ తాళ్లూరి, తదుపరి అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు వంటి అనేక సీనియర్ల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో ఎన్నికల సమరం లో ధీటుగా ఉన్నట్లే లెక్క.
ఇక ముందునుంచీ ప్రచారంలో ఉన్న నరేన్ కొడాలి కి గత బోర్డు చైర్మన్ గా ఉన్న వివాద రహిత ఇమేజ్, గత ఎన్నికల్లో ప్యానెల్ నుంచి పోటీ చేసిన గుర్తింపు తో పాటు ప్రస్తుతం చేరిన అనేక వేలమంది సభ్యుల ఓటు కై కోర్టుల ద్వారా శ్రమిస్తున్న కారణంగానూ, రవి పొట్లూరి, ప్రసాద్ నల్లూరి, హేమా కానూరి, రాజా కసుకుర్తి వంటి వారి సేవలకు తోడు ‘నాట్స్’ నుండి వచ్చిన ‘రాజకీయ’ ఉద్దండుడు శ్రీనివాస్ లావు, లోకేష్ నాయుడు, భక్త బల్ల తదితరులకు తోడు ప్రస్తుత అధ్యక్షుడు అంజయ్య లావు, ‘త్రిమూర్తుల’ తో పాటు అనేక సీనియర్ల సహకారంతో ఎన్నికల్లో విజయం పై ఆశాభావంతో ఉన్నారు.
ఎలక్ట్రానిక్/ఆన్ లైన్ ఓటింగ్ తో మొట్టమొదటిసారిగా జరపబోతున్న వచ్చే ‘తానా’ ఎన్నికల్లో అనేక సంచలనాలకు తావు ఉందనీ, గత కొన్ని సార్లు గా బలవంతపు బాలట్ కవర్ల కలెక్షన్స్ తో అపహాస్యమైన ఎన్నికల తంతుకు సరైన సమాధానాన్ని ‘తానా’ ఓటర్లు తమ స్వచ్ఛంద ఓటు హక్కు ద్వారా తెలియచెప్పుతారని ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే కాలానికి దిశా నిర్దేశం చేస్తాయని పలువురు ‘తానా’ శ్రేయోభిలాషులు ఆశాభావంతో ఉన్నారు.
ప్రస్తుతం నెలకొన్న తాత్కాలిక విరామం లో రెండు వర్గాలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్న పరిణామాలు ‘పెను తుఫాను’ ముందు కనిపించే ప్రశాంతత గా కనిపిస్తున్నప్పటికీ, ఇది మరింత ప్రమాదకర ఉప్పెన గా మారకుండా ‘టీ కప్పులో తుఫాను’ లాగా చెదిరిపోతుందనే ఆశిద్దాం.