టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఇన్ చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురైన అర్జునుడు విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే బచ్చుల అర్జునుడు అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ రోజు జరిగాయి. బచ్చుల అర్జునుడు అంత్యక్రియలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు.
ఆయనతోపాటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కేశినేని నాని, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ తదితర టిడిపి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బచ్చుల అర్జునుడు అంతిమయాత్రలో చంద్రబాబు, అచ్చెన్నాయుడులతోపాటు మిగతా నేతలు అంతా పాల్గొన్నారు. అర్జునుడి పాడెను చంద్రబాబు, అచ్చెన్నలు స్వయంగా మోశారు. అర్జునుడి అంతిమయాత్రకు పలువురు టీడీపీ నేతలు, భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.
అంతకుముందు, బచ్చుల అర్జునుడు మృతిపట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. అర్జునుడు కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా అర్జునడి మృతి పట్ట సంతాపాన్ని ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అర్జునుడు ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 25తో ముగియనున్న సంగతి తెలిసిందే. అర్జునుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.