ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. నేతల మధ్య విభేదాలు.. పార్టీపై అసంతృప్తి ఓ రేంజ్లో పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే.. కీలకమైన చీరాల, దర్శి వంటి నియోజకవర్గాలు వైసీపీ ఖాతా నుంచి ఎగిరిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ జాబితాలోనే ఒంగోలు కూడా చేరిందని చెబుతున్నారు. ఇక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయనకుఓటమి తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
ఇదిలావుంటే.. మరో కీలకమైన ఎస్సీ నియోజకవర్గం కొండపి. గత ఎన్నికల్లోనే ఇక్కడ నుంచి విజయం దక్కించుకుని తీరాలని అనుకున్నారు. కానీ, టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా.. ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారు. కానీ,, పరిస్థితులు దానికి అనుకూలంగా కనిపించడం లేదు. దీనికి కారణం.. కొండెపి నియోజకవర్గంలోని వైసీపీ వర్గాల మధ్య పోరు తారస్థాయికి చేరడమే.
పరస్పరం గొడవల కారణంగా కొండెపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబుపై.. మరో నాయకుడు వెంకయ్య వర్గం కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉంది. దీంతో అశోక్ బాబుపై పలుమార్లు సమావేశాలు పెట్టుకుని అసమ్మతి వెళ్లగక్కారు. ఒకరిపై ఒకరు సవాళ్లు కూడా విసురుకున్నారు. తనపై వెంకయ్య వర్గం లేనిపోని ఆరోపణలు చేస్తూ.. అప్రతిష్టపాలు చేస్తున్నారని అశోక్ బాబు వర్గం రోడ్డెక్కింది.
వెంకయ్య వర్గానికి చెందిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బి. అరుణ ఇంటిపై అశోక్ బాబు, అతని అనుచరులు దాడి చేశారు. టంగుటూరులో ఉన్న అరుణ ఇంటికి ఈరోజు ఉదయం అశోక్ బాబు వర్గీయులు వచ్చి అరుణ కోసం ఆరా తీశారు. ఆమె ఇంటికి వచ్చి గొడవపడ్డారు… హల్చల్ చేశారు. తనపై లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదంటూ అశోక్ బాబు, అతను వర్గీయులు తీవ్ర స్వరంతో వాగ్వాదానికి దిగారు.. అరుణ, ఆమె తల్లి అశోక్ బాబుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామంతో కొండపి వైసీపీ ఎంత బలంగా ఉందో అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఎన్నికల నాటికైనా కుదురుపడుతుందో లేదో చూడాలి.