తన అందంతో యూత్ ను పిచ్చెక్కించిన అందాల ముద్దుగుమ్మ హన్సిక. పలు భాషల్లో తనను తాను ఫ్రూవ్ చేసుకున్న ఆమె.. తాను ప్రేమించిన సోహైల్ కథూరియాను ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. తన పెళ్లి ఎపిసోడ్ పై ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ పైన ఆమె.. ఆమె తల్లి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇందులో ఆమెపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా రియాక్టు కావటమే కాదు.. ఘాటుగా బదులిచ్చారు.
బాలనటిగా కోయి మిల్ గయాలో చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. 2003లో విడుదలైన ఆ మూవీ తర్వాత నాలుగేళ్ల వ్యవధిలోనే దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించారు. బాలనటిగా పరిచయమైన నాలుగేళ్లకే హీరోయిన్ గా నటించిన ఆమెపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. పెద్ద అమ్మాయిగా కనిపించటానికి వీలుగా ఆమెకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్లుగాపలు ఆరోపణలు రావటం తెలిసిందే. అయితే.. ఈ అంశంపై అప్పటి నుంచి ఇప్పటివరకు రియాక్టు అయ్యింది లేదు.
తాజాగా చేసిన ఇంటర్వ్యూలో హన్సిక.. ఆమె తల్లి ఈ ఉదంతంపై సీరియస్ గా రియాక్టు అయ్యారు. తనపై వచ్చిన వార్తలన్ని అవాస్తవాలని.. తనకు 21 ఏళ్లు ఉండగా అలాంటి చెత్త వార్తలు రాసినట్లుగా ఫైర్ అయ్యారు. ‘నేను దేని గురించి మాట్లాడుతున్నానమో మీకు తెలుసు కదా? అప్పట్లో నేను అవి తీసుకొని ఉంటే.. ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉండాలి. నేను ఎదగటానికి ఇంజెక్షన్లు తీసుకున్నానని.. వాటిని నా తల్లే స్వయంగా ఇచ్చారని వార్తలు రాశారు’ అంటూ చెప్పుకొచ్ారు.
దీనిపై హన్సిక తల్లి కూడా రియాక్టు అయ్యారు. తన కుమార్తెకు తాను అప్పట్లో హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వాలంటే తాను టాటా, బిర్లా కన్నా సంపన్నురాలినై ఉండాలని.. కనీసం తాను మిలియనీర్ అయి ఉండాలన్నారు. వారు రాసింది నిజమైతే.. హన్సికతో పాటు వారికి కూడా ఇంజెక్షన్లు ఇప్పించి.. వారిని కూడా త్వరగా పెద్దవారు అయ్యేలా చేశాదాన్ని అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటివి ఎందుకు రాస్తారో తెలీదు? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాము పంజాబీలమని.. తమలో 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసులో ఆడపిల్లలు చాలా త్వరగా ఎదుగుతారని పేర్కొన్నారు. మొత్తానికి ఇన్నేళ్లుగా కంటిన్యూ అయిన ఒక ప్రచారాన్ని తాజాగా వివరణ ఇవ్వటం ద్వారా చెక్ పెట్టారని చెప్పాలి. అదేదో ఇంతకు ముందే చెప్పేసి ఉంటే.. ఆ ప్రచారానికి చెక్ పడేదేమో?