టాలీవుడ్ నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా కెరీర్ ని మొదలు పట్టిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. అక్క, తల్లి, అత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ప్రగతి ఆకట్టుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉండే ప్రగతి ఆంటీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా 50 ఏళ్ల వయసులోనూ జిమ్ లో తీవ్రంగా కష్టపడుతున్న ప్రగతి వీడియోలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో ప్రగతి షేర్ చేస్తుండడంతో ఆ వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి తన గతానికి సంబంధించిన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు. గతంలో తాను చేసిన అతి పెద్ద పొరపాటు తన పెళ్లి అని ప్రగతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ గా తన లైఫ్ సాగిపోతున్న సమయంలో తాను పెళ్లి చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం పెద్ద తప్పని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆ నిర్ణయం తన కెరీర్ ను 10 నుంచి 20 ఏళ్లు వెనక్కు లాగేసిందని ప్రగతి అన్నారు. ఆ నిర్ణయం వెనుక కోపం, అమాయకత్వం, మూర్ఖత్వం ఉంటాయని, అన్ని తెలుసు అనే ఒక అహంభావం కూడా ఆ వయసులో ఉంటుందని ప్రగతి అన్నారు. అయితే, ఆ వయసులో తమకు నచ్చిన పరిస్థితులు కల్పించుకొని మరీ అనుకున్నది జరగాలనుకుంటామని, కానీ, చేసిన తప్పును గ్రహించే లోపే నష్టం జరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తప్పు నుంచి బయటికి రావడానికి ప్రయత్నించడం ఆషామాషీ కాదని అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం కెరీర్ పై ఎంత ఫోకస్ పెడుతున్నానో హీరోయిన్ గా కూడా అంతే ఫోకస్ పెట్టి ఉంటే తన లైఫ్ మరోలా ఉండేదని ప్రగతి అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు అంటూ వేదాంత ధోరణిలో ప్రగతి ఆంటీ చెప్పిన డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.