బండ్ల గణేష్…తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని పేరు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టి….టాప్ ప్రొడ్యూసర్లలలో ఒకరిగా ఎదిగిన బండ్ల గణేష్ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. మెగా ఫ్యామిలీ…అందులోనూ ప్రత్యేకించి పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్ పరమ భక్తుడు. పవన్, మెగా ఫ్యామిలీపై బండ్ల గణే్ష్ ఈగ కూడా వాలనివ్వడు. మెగా ఆడియో ఫంక్షన్లలో పవన్ ను తెగ పొగిడేయడం బండ్లకు అలవాటు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేష్…మెగా ఫ్యామిలీపై అభిమానంతో పోస్టులు పెడుతుంటారు. అంతేకాదు, మెగా అభిమానులు పెట్టే పోస్టులకు కూడా బండ్లన్న రియాక్ట్ అవుతుంటాడు. అందుకే, పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా బండ్ల గణేష్‌ను ఫాలో అవుతుంటారు. గతంలో పవన్ కళ్యాణ్, జనసేన గురించి బండ్ల గణేష్ చేసిన పలు ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా బండ్ల గణేష్…కెరీర్ తొలినాళ్లలో తాను పడిన ఇబ్బందులు, పవన్ పై ఉన్న భక్తి గురించి ఓపెన్ అయ్యారు.
‘ప్రేమఖైదీ’ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా తొలిసారి నటించిన తాను…ఆ తరువాత యాక్టర్ కావాలని గట్టిగా ప్రయత్నించానని చెప్పారు. చెన్నై లో ఆఫీసుల చుట్టూ తిరిగానని, తనకన్న ఎత్తుగా, ఎర్రగా ఉన్న వారికే చాన్స్ లు రాకపోవడం చూసి తాను ప్రయత్నించడం వేస్టు అనుకున్నానని అన్నారు.
‘మీ డైరెక్షన్ సూపర్ .. మీ బొమ్మ బ్లాక్ బస్టర్’ అని దర్శకులను పొగిడితే చిన్న వేషం ఇచ్చేవారని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసొచ్చాక నిర్మాతగా మారడానికి, ఈ స్థాయిలో నిలబడడానికి మాత్రం తన దైవం పవన్ కల్యాణ్ గారే కారణమని బండ్ల గతంలోని విషయాలను నెమరేసుకున్నారు.