తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితోపాటు మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించిన ఘటన దేశ రాజకీయాలను కుదిపేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో పోలీసుల దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టు గతంలో స్టే విధించడం, ఆ తర్వాత కేసు దర్యాప్తును మొయినాబాద్ పోలీసులు కొనసాగించవచ్చంటూ హైకోర్టు సంచలన తీర్పునివ్వడం తెలిసిందే.
అయితే, ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని బిజెపి దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు…ఈ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు సినీ ఫక్కీలో కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ వాదనలను విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ నిర్ణయానికి వచ్చింది. వాస్తవానికి, ఈ కేసును మొదట ఏసీబీ హ్యాండిల్ చేసింది.
అయితే ఆ తర్వాత హైదరాబాద్ కమిషనర్ సి వి ఆనంద్ నేతృత్వంలో సిట్ ను నియమించారు. అయితే, ఈ కేసును ఏసీబీ విచారణ జరుపుతుందని, సిట్ దర్యాప్తు చేయడం ఏమిటని ఏసీబీ కోర్టు ఆక్షేపించింది. అంతేకాదు, సిట్ దాఖలు చేసిన నివేదికలను కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించింది. మరోవైపు, సిట్ దర్యాప్తు కుట్రపూరితంగా జరుగుతోందని నిందితులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని వారు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
దీంతో, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో ఏర్పాటైన సిట్ ను రద్దు చేసి..కేసును సీబీఐకి అప్పగించింది. కాగా, ఆల్రెడీ ఈ కేసును ఈడి కూడా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు నందకుమార్ ను జైల్లోనే కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తోంది. మరోవైపు ఈడీపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందకుమార్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్న ఈడీ తనను నిందితుడిగా మార్చే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు.