సీఎం జగన్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన పేరు జగన్ అని, తాను ఏపీలోనే ఉంటానని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. తన పేరు జగన్ అని, తాను ఇక్కడే ఉంటానని జగన్ సినిమా డైలాగులు చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో అమరావతి విషయంలోనూ జగన్ అలాగే చెప్పారని, రాజధాని ఇక్కడే ఉంటుందన్న మాటకు సీఎం అయిన తర్వాత జగన్ కట్టుబడి లేరని గుర్తు చేశారు.
అటువంటి జగన్…తాజాగా తనది ఏపీ అని, ఇక్కడే ఉంటానని చెప్పిన మాటకు గ్యారెంటీ ఏంటని నిలదీశారు. 2024లో జగన్ ఓటమి తప్పదని, ఓడినా సరే జగన్ అమరావతిలోనే ఉంటారా? అని జగన్ ను ప్రశ్నించారు. అంతేకాదు, ఏపీలోనే జగన్ ఉంటాను అని లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుందని, లేదంటే హైదరాబాద్ గుర్తొస్తుందని విమర్శించారు.
రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేయడం మినహా కొత్త కంపెనీలను తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అంటూ జగన్ను నిలదీశారు. జగన్ పాలనలో ఏపీలోని ఐటీ రంగం కుదేలైందని దుయ్యబట్టారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 0.1 శాతంగా ఉందని, ఐటీ ఉత్పత్తుల్లో రాష్ట్రం పేరు ఎక్కడా కనిపించడంలేదని జీవీఎల్ విమర్శలు గుప్పించారు. ఉన్న ఐటీ సంస్థలను తరిమేయడం తప్ప కొత్త కంపెనీలను తెచ్చే పరిస్థితి లేదని, జగన్ కు అసలు ఆ ఆలోచన లేదని ఆరోపించారు. తాజాగా జగన్ పై జీవీఎల్ కామెంట్స్ చూస్తుంటే వైసీపీ, బీజేపీల మధ్య గ్యాప్ చాలా పెరిగిందన్న టాక్ కు ఊతం లభించినట్లయింది.