అనంతపురం జిల్లా రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న రీతిలో కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తోపుదుర్తి వల్లే జాకీ పరిశ్రమ ఏపీ నుంచి తెలంగాణకు తరలిందని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల కోసం తెలుగుదేశం పేరుతో పరిటాల సునీత రాప్తాడులో పాదయాత్ర చేపట్టారు.
అయితే, తన పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సూచనలు, ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తన యాత్రలో పాల్గొనకుండా రైతులను అడ్డుకుంటున్నారని, చెక్ పోస్ట్ లు పెడుతున్నారని సునీత మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు సృష్టించినా సరే రైతుల సంక్షేమం కోసం ఈ యాత్రను కొనసాగిస్తానని సునీత అన్నారు.
రైతుల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని సునీత ప్రకటించారు. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ అంటూ తోపుదుర్తికి సునీత వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బండారం బయటపడతారని హెచ్చరించారు. రైతుల కోసం ప్రకాష్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని, అంతకుమించి ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. జాకీ పరిశ్రమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు అప్పగించే దమ్ముందా అని తోపుదుర్తికి సునీత సవాల్ విసిరారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోవడంలేదని, రాప్తాడులో అక్రమాలు ఆయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.