వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. దీంతో, సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య వర్సెస్ వీర సింహారెడ్డి అంటూ ఇప్పటినుంచే ప్రచారం మొదలైంది. ఇలా ఇద్దరు ముగ్గురు హీరోల పెద్ద సినిమాలు పండగ సందర్భంగా విడుదల కావడం, ఏ సినిమా కథను బట్టి ఆ సినిమానే ప్రత్యేకంగా నిలిచి వసూళ్లు రావడం మామూలే.
సినిమాలోని కంటెంట్ ను బట్టి, అది హిట్టా, ఫ్లాపా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది తాజాగా ఈ సినిమాల పేర్లకు, సినీ హీరోలకు మధ్య కులాల చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలకృష్ణ, చిరంజీవిల గత సినిమాలను, తాజా సినిమాలను పోలుస్తూ టిడిపి అభిమాని ఒకరు పెట్టినట్టుగా వైరల్ అవుతున్న పోస్ట్ ఒకటి సంచలనంగా మారింది.
నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, గౌతమి పుత్ర శాతకర్ణి, వీర సింహారెడ్డి, సమరసింహారెడ్డి ఇలా అగ్రవర్ణాలకు చెందిన పేర్లతోనే బాలకృష్ణ సినిమాలు తీస్తున్నారని టిడిపి ఫరెవర్ అనే ఖాతా నుంచి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అయిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. అదే సమయంలో స్నేహం కోసం, మృగరాజు, అంజి, ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య అంటూ చిరంజీవి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వంటి అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా సినిమాల పేర్లు పెడుతున్నారన్నది ఆ పోస్ట్ సారాంశం.
ఆ టిడిపి ఫరెవర్ అనే ఖాతాకు జై లోకేష్ టిడిపి అంటూ ఉండడంతో ఈ వ్యవహారంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ప్యాలెస్ పిల్లి చీప్ ట్రిక్స్ అని, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఐప్యాక్ గ్యాంగ్స్, పేటీఎం డాగ్స్ రంగంలోకి దిగాయని లోకేష్ అన్నారు. కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారితో తస్మాత్ జాగ్రత్త అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అటువంటి వారిని చెప్పుతో కొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు.
ఫేక్ అకౌంట్స్ జగన్ కు ఆత్మ సంతృప్తిని ఇస్తాయేమో గానీ, ఓటమి నుండి తప్పించలేవంటూ లోకేష్ చెప్పారు. ఏదేమైనా ఈ ఫేక్ అకౌంట్ వ్యవహారం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.