దక్షిణాదిలో పలు చిత్రాల్లో అగ్ర హీరోయిన్గా నటించిన తమన్నా కొంతకాలంగా హిట్ లు లేక ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘బబ్లీ బౌన్సర్’ చిత్రంతో ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తమన్నా సిద్ధమైంది. అయితే, ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన తమన్నా ఓ వివాదంలో చిక్కుకుంది. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత..మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్లు దాడికి దిగడం వివాదానికి దారి తీసింది. ఈ దాడిలో ఇద్దరు కెమెరామెన్లకు గాయాలయ్యాయి.
తమన్నా ఫొటోలు తీసుకునేందుకు, చిత్రం గురించి ప్రశ్నలు అడిగేందుకు ఫొటోగ్రాఫర్లు, జర్నలిస్టులు ప్రయత్నించారు. అయితే, తమన్నాను వారు ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియా ప్రతినిధులతో తమన్నా బౌన్సర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో, ఆ బౌన్సర్లను మీడియా ప్రతినిధులు నిలదీశారు. దీంతో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ గొడవ ముదరడంతో మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్లు దాడికి దిగారు.
ఈ దాడిలో ఇద్దరు కెమెరామెన్లకు గాయాలయ్యాయి. ఆ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బౌన్సర్ లలో ఒకరు డస్ట్ బిన్ ని ఎత్తి దాడి చేస్తామని బెదిరించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో, తమన్నాపై, ఆమె బౌన్సర్లపై ట్రోలింగ్ జరుగుతోంది. బబ్లీ బౌన్సర్ అని టైటిల్ పెట్టుకున్న తమన్నా…ఇలా బౌన్సర్లతో దాడి చేయించడం ఏమిటంటూ నెటిజన్లు దుయ్యబడుతున్నారు. కష్టపడి డబ్బు సంపాదించాలని ఢిల్లీ వెళ్లిన ఒక పేద అమ్మాయి…బౌన్సర్ గా మారిన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 23న విడుదలకాబోతోంది.