టాలీవుడ్ హీరో రానా, మిహికా బజాజ్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొద్దిరోజులుగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులోను, పెళ్లయిన కొత్తలో సోషల్ మీడియాలో తమ ఫోటోలు షేర్ చేసే రానా ఈ మధ్యకాలంలో అంత యాక్టివ్ గా ఉండటం లేదు. దాంతోపాటే, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి ఫోటోలను రానా డిలీట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆ పుకార్లకు మరింత ఊతం లభించినట్లయింది.
అయితే, తమ మధ్య గ్యాప్ లేదని మిహికా బజాజ్ క్లారిటీ ఇస్తూ తాము కలిసున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా తన భార్య మిహఇకా బజాజ్ తో కలిసి రానా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరితోపాటు రానా తండ్రి, ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్, రానా సోదరుడు దగ్గుపాటి అభిరామ్ కూడా ఉన్నారు. స్వామివారికి వీరంతా మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వెంకన్నను రానా దంపతులు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రానాతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. అయితే గుడి దగ్గర ఫోటోలు వద్దని రానా సున్నితంగా వారిని వారించాడు. తనతో ఫోటో దిగేందుకు ప్రయత్నించిన ఓ అభిమాని ఫోనును రానా లాక్కున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ అభిమానితో రానా దురుసుగా ప్రవర్తించారని కొందరు అంటున్నారు. అయితే, వద్దని వారిస్తున్నా ఫొటోలు తీయడం వల్లే ఫోన్ లాక్కున్నాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎంత సినీ తారలైనా వారి ప్రైవసీని కూడా గౌరవించాలని అంటున్నారు.