సాధారణంగా ఊరి చివర పొలాల్లో కోట్లు కుమ్మరించి వెంచర్లు వేస్తుంటారు. ఆ వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించడమో..లేదంటే అపార్ట్ మెంట్లు కట్టి అమ్మడమో చేస్తుంటారు. వీటిలో ఏది చేసినా..ముందుగా వెంచర్ వేసే ప్రతి ఒక్కరు అక్కడ ముందుగా ధృఢమైన సీసీ రోడ్డు, కరెంటు, నీటి సదుపాయం వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పిస్తుంటారు. అందుకోసం అయ్యే ఖర్చుకు అస్సలు వెనుకాడరు.
ఎందుకంటే, ఆ మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చే వారు వేయబోయే వెంచర్ కు మూల పెట్టుబడి. ఆ ప్రాథమిక సదుపాయలుంటేనే కొనుగోలుదారులు అక్కడ కొనేందుకు ఆసక్తి చూపుతారు. అలా కాకుండా, మౌలిక సదుపాయాలకు డబ్బు ఖర్చవుతుందని వెనుకాడితే…మొదటికే మోసం వచ్చి…వెంచర్ కోసం కొన్న భూమి కొన్నాళ్లకు..దేనికీ పనికి రాకుండా పోయి…తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ వెంచర్ సూత్రం అమరావతికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.
అమరావతి బంగారు బాతుగుడ్డు వంటిదని, దానికి మౌలిక సదుపాయలు అనే దాణా వేసి ఉంటే ఈ రోజు ఏపీ అప్పుల కుప్పగా కాకుండా ఆర్థిక భాండాగారంగా ఎదిగి ఉండేదని టీడీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. అయితే, టీడీపీ నేతలు మాత్రమే కాదు, మోహన్ దాస్ పాయ్ లాంటి పారిశ్రామికవేత్తలు, శేఖర్ గుప్తా లాంటి జర్నలిజం దిగ్గజాలు కూడా..అమరావతిని నిర్వీర్యం చేస్తూ మూడు రాజధానుల పల్లవి అందుకున్న జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. అమరావతి నిర్మాణాలను జగన్ కొనసాగించి ఉంటే ఆర్థికంగా కూడా జగన్ ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వచ్చి ఉండేదని, ఇలా అప్పుల కోసం అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చేది కాదని ఆర్థిక నిపుణులు సైతం చెబుతున్నారు.
అమరావతిలో ఎప్పుడు ఎంత ఖర్చు పెడితే ఎంత ఆదాయం వస్తుంది అని పక్కా లెక్కలతో సహా 2019లో జీవో నంబర్ 50ని నాటి సీఎం చంద్రబాబు ఎంతో ముందుచూపుతో రూపొందించారు. ఆ సమయానికి అమరావతిలో ప్రైవేటు సంస్థలు, దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీలు భారీ నిర్మాణాలు చేపడుతున్నాయని, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ సంబంధిత వ్యాపారాలు పుంజుకుంటున్నాయని, ఈ తరుణంలో జగన్ అమరావతిని నిర్వీర్యం చేశారని అంటున్నారు. వాటికి సంబంధించిన లావాదేవీలు యాభై వేల కోట్ల వరకూ ఉంటాయని, అందులో దాదాపుగా వివిధ ఫన్నుల రూపంలో ప్రభుత్వానికి ఇరవై శాతానికి పైగా ఆదాయం వచ్చి ఉండేదని చెబుతున్నారు.
అంతెందుకు, అమరావతిని చేజేతులా నిర్వీర్యం చేసిన జగనే అక్కడ భూమి ఎకరం 10 కోట్లకు బేరం పెట్టారు. అంటే, ఒకవేళ అమరావతి నిర్మాణాలను జగన్ కొనసాగించి ఉంటే ఆ విలువ ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జగన్ మోనార్క్ లా వ్యవహరించి ఉండకపోతే అమరావతిలో ఎకరం కనీసం 20 కోట్లు పలికేదని అంచనా. ఏది ఏమైనా ఆర్థిక అక్షయ పాత్ర వంటి అమరావతిని నిర్వీర్యం చేసి జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికైనా కళ్లు తెరిచి అమరావతిని డెవలప్ చేస్తే ఏపీని అప్పుల బారినుంచి కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. బంగారు బాతు గుడ్డు వంటి అమరావతిని జగన్ కోసివేశారని విమర్శలు వస్తున్నాయి. మరి, తాజాగా అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం చూసైనా జగన్ కు కనువిప్పు కలుగుతుందేమో చూడాలి.