వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ యువ నాయకుడు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. మంగళగిరిపై మరింత వ్యూహాన్ని పెంచారు. వీధి వ్యాపారులు.. చేతి వృత్తుల వారికి ఆయన ఆపన్న హస్తం అందంఇస్తున్నారు. తమకాళ్ల మీద తాము నిలబడుతూ ఉపాధి పొందుతున్న బడుగుజీవులకు తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్న నారా లోకేష్ సొంత సొమ్ముతో తోపుడు బండ్లను చేయించి అందిస్తున్నారు.
కాయగూరలు అమ్మేందుకు వీలుగా ఒక మోడల్ బండి, ఇస్త్రీ చేసేందుకు అనువైనది మరో మోడల్ బండి, టిఫిన్ బండి ఇలా వారి వారి అవసరాలకు అనుగుణంగా, నాణ్యంగా బండ్లు చేయించి అందజేస్తున్నారు. ఇప్పటివరకూ పండ్లు, కూరగాయలు, ఇతరత్రా సామాన్లు అమ్మేవాళ్లకు 157 తోపుడు బండ్లు అందజేశారు. 14 ఇస్త్రీ బండ్లు పంపిణీ చేశారు. టిఫిన్ స్టాళ్ల కోసం 8 బండ్లు, వికలాంగులకి 13 ట్రైసైకిళ్లు నారా లోకేష్ అందజేశారు.
ఒకరికి బడ్డీకొట్టు చేయించి ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో నారా లోకేష్ పంపిణీ చేసిన తోపుడు బండ్లు పసుపు రంగుతో స్వాగతం పలుకుతున్నాయి. ఉపాధికాంతులు వెదజల్లుతున్నాయి. లబ్దిదారుల మోముల్లో చిరునవ్వులు చిందుతున్నాయి. ఒక బండి చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివారు నారా లోకేష్ ని కలిసి విన్నవించినా, మంగళగిరి నియోజకవర్గ టిడిపి కార్యాలయం(ఎంఎస్ఎస్ భవన్)కి దరఖాస్తు ఇస్తే చాలు. తక్షణమే చేయించి.. రెండు మూడు రోజుల్లోనే వారికి అందిస్తున్నారు.
పేదలైతే చాలు బండిని ఆకర్షణీయంగా తయారు చేసి అందిస్తారు. వివిధ రకాల ఉపాధికి సాయంగా నిలిచిన 200కి పైగా తోపుడు బండ్లు ఆయా కుటుంబాలకి ఆసరాగా నిలుస్తున్నాయి. మరో 400 బండ్లు సిద్ధం అవుతున్నాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందిస్తున్న ఆసరాతో తమ బతుకు బండి ఇలా సాగుతోందంటున్నారు లబ్ధిదారులు. అయితే.. ఇదంతా కూడా వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తమ నాయుడు వేస్తున్న అడుగులని పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం.