ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే యూఎస్ లో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు భారతీయులు పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా సైతం భారత్ నుంచి అప్లై చేసుకునే విద్యార్థులకు ఈసారి పెద్దపీట వేసినట్లుగా అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రికార్డుస్థాయిలో 2022లో ఏకంగా 82వేల స్టూడెంట్ వీసాల్నిజారీ చేసినట్లుగా అధికారికంగా వెల్లడించింది.
ఇది ఇతర దేశాల కంటే ఎక్కువ కావటం ఆసక్తికరంగా మారింది. అమెరికాలో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ కు చెందిన వారు ఎక్కువగా ఉండటం విశేషం. భారత్ లో యూఎస్ మిషన్ 2022లో భాగంగా ఈసారి రికార్డు స్థాయిలో వీసాలు భారతీయ విద్యార్థులే చేజిక్కించుకున్నారు. అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించే మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 20 శాతానికి పైనే భారతీయ విద్యార్థులు ఉండటం గమనార్హం.
కొవిడ్ కారణంగా రెండేళ్లుగా స్టూడెంట్ వీసాల జారీలో తీవ్ర జాప్యం నెలకొన్న సంగతి తెలిసిందే. గడిచిన కొద్ది నెలలుగా కరోనా వ్యాప్తి తగ్గిపోవటం.. మూడో వేవ్ పెద్ద ఎత్తున కేసులు నమోదైనప్పటికీ.. దాని ప్రభావం అంతంతమాత్రంగా ఉండటంతో.. రెండో వేవ్ తో వేళ.. భారత్ లో నెలకొన్న పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులు మూడో వేవ్ లో నెలకొన్నాయని చెప్పక తప్పదు.
మూడో వేవ్ ముగిసిన తర్వాత చాలా త్వరగానే సాధారణ పరిస్థితులు నెలకొనటంతో పాటు.. విదేశీ విద్యార్థులకు ఆడ్మిషన్లకు అమెరికా విద్యాసంస్థలు ఆహ్వానం పలుకుతున్న వేళలో.. భారత్ కు చెందిన విద్యార్థులు ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం విశేషం. దేశ వ్యాప్తంగా నాలుగు ఎంబసీల్లో (చెన్నై.. హైదరాబాద్.. కోల్కతా.. ముంబయి) ఈ ఏడాది మే నుంచి ఆగస్టు వరకు వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ కు ప్రాధాన్యతను ఇచ్చాయి.
వీలైనంత మంది అర్హులైన విద్యార్థులకు షెడ్యూల్ షురూ అయ్యేనాటికి అమెరికాకు చేరుకునేలా ప్లాన్ చేసుకునే పరిస్థితి. మొత్తంగా అమెరికా జారీ చేసిన స్టూడెంట్ జారీ వీసాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటం ఆసక్తికరంగా మారింది. భారత్ కు ఇస్తున్న ప్రాధాన్యత తాజా పరిణామం స్పష్టం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
Comments 1