కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామ చంద్రారావు కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా పేరున్న కేవీపీ….కొన్నేళ్లుగా సైలెంట్ అయ్యారు. అడపాదడపా మీడియా సమావేశాల్లో కనిపించినా…రాజకీయంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన దాఖలాలు లేవు. అటువంటి కేవీపీ…తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేటి నుంచి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టబోతోన్న భారత్ జోడో యాత్ర నేపథ్యంలో బీజేపీపై కేవీపీ షాకింగ్ కామెంట్లు చేశారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఏ మాత్రం ప్రమేయం లేని బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగర్భ శ్రీమంతుడైన జవహార్లాల్ నెహ్రూ స్వాతంత్ర్య పోరాటంలో పదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. అలాంటి నెహ్రూ చరిత్రను కర్ణాటక పాఠ్యపుస్తకాల నుంచి, క్విట్ ఇండియా ఉద్యమం నుంచి తొలగించిన బీజేపీపై మండిపడ్డారు.
నెహ్రూతోపాటు అనేకమంది జైలుకెళ్లారని, ఆస్తులను త్యాగం చేశారని, వారిని కూడా స్మరించుకుందామని పిలుపునిచ్చారు కేవీపీ. క్విట్ ఇండియా ఉద్యమంలో నేటి పాలక పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. హెడ్గేవార్, దీన్ దయాళ ఉపాధ్యాయ వంటి వారు బ్రిటీష్ వారితో కుమ్మక్కై దేశాన్ని విభజించే కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను విస్మరించలేమని, వారితో సైద్ధాంతికంగా తమకు విభేదాలుండడం వేరే విషయమని అన్నారు.
అయితే, ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న కేవీపీ సడెన్ గా యాక్టివ్ కావడం, అందులోనూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంపై చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికలకు ముందు ఏపీలో కాంగ్రెస్ బలపడాలని చూస్తోందని, ఈ క్రమంలోనే కేవీపీ తెరపైకి వచ్చారని అంటున్నారు.
Comments 1