చికాగోలో తెలుగుదేశం పార్టీ ఎన్.ఆర్.ఐ విభాగం ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా నాలుగో మినీ మహానాడు కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి జయరాం కోమటి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడమైనది.
తీర్మానాలు
1.ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి
సామాజిక విప్లవ ఉద్యమ నిర్మాత, జాతి నిర్మాణం వైపు తెలుగు ప్రజలను జాగృతం చేసిన మహనీయుడు, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. ఎన్టీఆర్ నీతి, నిజాయతీ, నిరాడంబరత, శ్రమను ప్రతి తెలుగువాడు ఆదర్శంగా తీసుకోవాలి. ఢిల్లీ బాదుషాల దగ్గర తాకట్టు పెట్టిన తెలుగువారి ఆత్మగౌరవానికి విముక్తి కల్పించిన మహనీయుడు. మదరాసీలుగా పిలువబడే తెలుగువారికి గుర్తింపు, ఆత్మగౌరవాన్ని చాటిన మహానుభావుడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినదించిన వ్యక్తి ఎన్టీఆర్. పేద ప్రజల సంక్షేమానికి, సంస్కరణలకు ఆద్యుడు. రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, విధులు, హక్కులపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ధీరుడు. అచంచలమైన జాతీయవాద, అంకితభావంతో న్యాయసమ్మతమైన ప్రాంతీయ ఆకాంక్షలను సమతుల్యం చేశాడు. జాతీయ రాజకీయాలను బాగా ప్రభావితం చేసిన ప్రాంతీయ పార్టీ నేత ఎన్టీఆర్. సరికొత్త తరానికి, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన భారత ప్రజాస్వామ్య దిక్సూచి ఎన్టీఆర్. ప్రతి సందర్భంలోనూ పరిణితిని ప్రదర్శించి తెలుగు జన హృదయ నేతగా జాతీయ నాయకుడిగా గుర్తింపబడ్డారు. తెలుగువారికి ఇంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఎన్టీఆర్ తెలుగు జాతి ఉన్నంత కాలం వారి మదిలో చిరస్మరణీయుడిగా ఉంటారు. శ్రీ నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ వేదిక ద్వారా తీర్మానించడమైంది.
2.వెంకయ్య నాయుడు మరియు జస్టిస్ ఎన్వీ రమణ లకు అభినందనలు
భారత ఉపరాష్ట్రపతిగా సమర్థవంతంగా పనిచేసిన తెలుగు కీర్తి కిరీటం ముప్పవరపు వెంకయ్యనాయుడు, మరో తెలుగు తేజం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేశారు. వారిరువురు భారతీయ సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగుభాష మాధుర్యాన్ని ఎన్టీఆర్ తర్వాత ప్రపంచానికి తెలియజేసిన మహనీయులు. వారిరువురు ఆయా రంగాల్లో బాగా రాణించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల జస్టిస్ ఎన్వీ రమణ జయరాం కోమటి ఆధ్వర్యంలో అమెరికాలో పర్యటించి, తెలుగువారితో మమేకమై తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. ఉన్నతమైన విలువలతో పనిచేసి ఆ పదవులకు వన్నెతెచ్చిన వారిరువురు పదవీ విరమణ చేశారు. వారిని ఈ మహానాడు వేదికగా అభినందిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించడమైంది.
3.కుప్పంలో అన్నా క్యాంటీన్ ను అడ్డుకోవడం అప్రజాస్వామికం
ప్రభుత్వం అన్నం పెట్టక పోగా.. పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య. ఇది జగన్ రెడ్డి పైశాచికత్వానికి పరాకాష్ట. కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుకోవడం అప్రజాస్వామికం. మూడున్నరేళ్ల లో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా మూసేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలి, ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో బాధ్యతాయుతంగా అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తుంటే వాటిని అడ్డుకోవడం, చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై దాడికి తెగబడటాన్ని ఈ మహానాడు వేదిక ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం.
4.అనైతికంగా, నగ్న ప్రదర్శనలు ఇస్తున్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి
జగన్ రెడ్డి పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా సాక్షాత్తూ పార్లమెంట్ సభ్యుడి నగ్న వీడియో వలన రాష్ట్ర పరువు, ప్రతిష్టలు మంట కలిశాయి. మహిళల మాన, ప్రాణాల కంటే కామాంధులైన పార్లమెంట్ సభ్యుడు, మంత్రులు, మాజీ మంత్రులను రక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు తాపత్రయపడుతున్నారు. జగన్ రెడ్డి స్వయంగా నేర స్వభావం కలవారు కాబట్టే నేరస్థులను, దొంగలను, దోపిడీదారులను, రేపిస్ట్ లను ప్రోత్సహిస్తున్నారు. జగన్ రెడ్డికి ఏమాత్రం మహిళల పట్ల గౌరవం, చిత్తశుద్ధి ఉంటే న్యూడ్ వీడియోల్లో ఉన్న పార్లమెంట్ సభ్యుడిని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను డిస్మిస్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ మహానాడు వేదిక ద్వారా తీర్మా నించడమైంది.
5.రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలి
న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు కట్టుబడి అమరావతి రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలి. అమరావతి రాజధానిని మార్చే హక్కుగాని, మూడు రాజధానులు పెట్టే అధికారంగాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి లేదని తెలుసు. కానీ మూడేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ఇటీవల రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ఇది మరింత తేటతెల్లమైంది. జగన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అమరావతిని నాశనం చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఇకనైనా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాజధాని అమరావతిని అభివృద్ధి పరచాలని కోరుతూ మహానాడు ద్వారా తీర్మానించడమైంది.
6.సభ్యత్వ నమోదు – పార్టీ సంస్థాగత నిర్మాణం
పార్టీని సంస్థాగతంగా బలంగా నిర్మించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టడం జరిగింది. ఇందుకు ఎన్.ఆర్.ఐ టీడీపీ యూఎస్ విభాగం కూడా తమవంతు కర్తవ్యాన్ని సమర్థవంతంగా అమలుచేస్తోంది. సభ్యత్వ నమోదులో ప్రతిఒక్కరు పాల్గొనాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. ఇక్కడ నివసిస్తున్న వారిలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అభిమానులే. గతంలో వచ్చిన సభ్యత్వ నమోదుకంటే ఈ ఏడాది నమోదు మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ వేదిక ద్వారా తీర్మానించడమైంది.
ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్ఫూర్తితో తెదేపాని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఎన్టీఆర్ కలలుకన్న అభివృద్ధి, సంక్షేమ రాజ్యం రావాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరంగా ప్రవాసాంధ్రులు భావిస్తున్నారు. ప్రస్తుత పాలకులపై నమ్మకం లేక పెట్టుబడులు ఆగిపోయాయి. అభివృద్ధి కుంటుపడిపోయింది. అమరావతి రాజధానిలో అనేక పరిశ్రమలు స్థాపించేందుకు ప్రవాసాంధ్రులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే పెద్దఎత్తున దాడులకు దిగుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లేదీసే పరిస్థితి నెలకొంది. పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, సమాజాన్ని జగన్ రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మత, ప్రాంతాల పరంగా విభజించి పాలిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రవాసాంధ్రులపై ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమాన్ని చికాగో టీడీపీ సీనియర్ నాయకులు హేమ కానూరు సమన్వయ పరచగా, సిటీ టీడీపీ నాయకులు రవి కాకర, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, చిరంజీవి గళ్ళ, కృష్ణ మోహన్, శ్రీనివాస్ పెదమల్లు, శ్రీ హరి కట్టా, ప్రవీణ్ వేములపల్లి, మదన్ పాములపాటి, మహేష్ కాకరాల, వినోజ్ చనుమోలు, లక్ష్మణ్ తదితర నాయకులు కార్యక్రమం విజయవంతం అవ్వడంలో సహకరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభిమానులు రామ కోటేశ్వర రావు కాట్రగడ్డ, శ్రీలత గరికిపాటి, చాందిని దువ్వూరి, వాసవి చక్క, దేవి ప్రసాద్ పొట్లూరి, యుగంధర్ నగేష్ కాండ్రేగుల తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సహంగా పాల్గొన్న పార్టీ అభిమానులందరికి పేరు పేరున జయరాం కోమటి కృతజ్ఞతలు తెలియజేసారు.