ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలపై మెగా స్టార్ చిరంజీవి సూచనాత్మక విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ తరహాలో తెలుగు దర్శకులు కూడా సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని చిత్రంలోని నటీనటులందరికీ వినిపించాలని, వర్క్ షాపులు పెట్టాలని చిరు సూచించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మంచి సినిమాలు తీస్తే జనం ఆటోమేటిక్ గా థియేటర్లకు వస్తారని కూడా చిరు గతంలో వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.
ఆ కామెంట్లకు కొనసాగింపుగానే తాజాగా చిరు మరోసారి తెలుగు సినిమాలు, ఓటీటీలు, థియేటర్లకు జనం రావడంపై తన మార్క్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. స్మార్ట్ఫోన్లు, ఓటీటీలు వంటివి ఎన్ని వచ్చినా సరే కంటెంట్ ఉంటే జనం థియేటర్లకు తప్పక వస్తారని చిరు అన్నారు. ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’ సినిమా హిట్ లుగా నిలిచి భారీ వసూళ్లు రాబట్టడమే అందుకు నిదర్శనమని చెప్పారు.
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి…కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ తగ్గదని అన్నారు. సక్సెస్ రేటు అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉందని, కంటెంట్ లేకుంటే రెండో రోజే సినిమా కనుమరుగైపోతుందని అన్నారు. ఈ మధ్యకాలంలో అలా కంటెంట్ లేకుండా సినిమా తీసి విఫలమైన బాధితుల్లో తాను కూడా ఒకడినని గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకుల అభిరుచి ఏమిటి అనే విషయాన్ని డైరెక్టర్లు గమనించాలని చిరు సూచించారు.
డేట్స్ క్లాష్ అవుతాయని షూటింగ్స్ విషయంలో కంగారు వద్దని, ఒక సినిమా రూపొందించే క్రమంలో ఎంతోమంది దర్శకుడిపై ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. కంటెంట్ విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, అలా ఆలోచించిన రోజున ఇండస్ట్రీకి మరిన్ని హిట్స్ వస్తాయని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా ‘శ్రీజ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్లో నిర్మించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా సెప్టెంబరు 2న విడుదల కానుంది.
Comments 1