సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కూడా జగన్ కక్ష సాధిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడతూ, జగన్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతున్న పాపానికి కొందరిని జగన్ సర్కార్ వేధిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో టీడీపీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన పలువురుని రకరకాల కారణాలతో అరెస్టు చేసిన వైనంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయినా సరే, తీరు మారని జగన్ సర్కార్ తాజాగా మరో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై కక్ష సాధించింది, ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు వెంగళరావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంగళరావును సీఐడీ పోలీసులు కొట్టారని వారు ఆరోపిస్తున్నారు. ఏదైనా విషయంపై ప్రశ్నించే అధికారం సీఐడీ పోలీసులకు ఉందని, కానీ, ఇలా కొట్టడం ఏంటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంగళరావు కుటుంబ సభ్యులతో మాట్లాడిన లోకేష్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వెంగళరావును అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు ఆయనను గుంటూరులోని ఆరో అదనపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే ఆ ఘటనపై వెంగళరావు స్వయంగా స్పందించారు. సీఐడీ పోలీసులు తనను దుస్తులు తొలిగించి మరీ తీవ్రంగా కొట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్నిజడ్జి గారికి వెల్లడిస్తే తన రెండేళ్ల కుమారుడిని చంపేస్తామని బెదిరించినట్లుగా వెంగళరావు న్యాయమూర్తి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
విచారణ పేరుతో పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేశారని ఆయన న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దీంతో, ఆ వాంగ్మాలాన్ని నమోదు చేసుకున్న న్యాయమూర్తి…వెంగళరావుకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తనకున్న గాయాలను వెంగళరావు చూపించడంతో మరోసారి వైద్య పరీక్షలకు ఆదేశించారు.ఈ క్రమంలోనే వెంగళరావుకు వైద్యులు మరోసారి పరీక్షలు చేసి ఆ నివేదికను సీల్డ్ కవర్లో జడ్జికి అందజేయనున్నారు.
Comments 1