- హెచ్ఆర్ఏ శ్లాబులూ తగ్గింపు
- 2018 జూలై 1 నుంచి వర్తింపు?
- ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాలలు
- రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
- ఫలించని సీఎస్ చర్చలు
- దర్శనమివ్వని సీఎం
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తనతో భుజం భుజం కలిపిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గట్టి షాకే ఇచ్చారు. వారికి ఫిట్‌మెంట్‌ను 7.5 శాతం మాత్రమే పెంచుతూ తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చేసిన సిఫారసును ఆయన ఆమోదించినట్లు తెలిసింది. పీఆర్సీ సిఫారసులపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయు. అయినా ఫలితం లేకపోయింది. నివేదికను యథాతథంగా అమలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తన సిఫారసులను 2018 జూలై 1 నుంచి అమలు చేయాలని పీఆర్సీ సూచించింది. అయితే అమలు విషయంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తేదీని నిర్ణయించుకోవచ్చని సూచించింది. కనీస వేతనాన్ని రూ.13 వేల నుంచి రూ.19 వేలకు పెంచింది. గరిష్ఠ వేతనాన్ని రూ.1,62,070గా నిర్ధారించింది. ప్రస్తుతం ఉద్యోగులకు అమలు చేస్తున్న రూ.12 లక్షల గ్రాట్యుటీని రూ.16 లక్షలకు పెంచాలని పేర్కొంది.
వారి పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని, చైల్డ్ కేర్ లీవ్స్‌ను 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలని సూచించింది. ఉద్యోగులకు వివిధ నగరాలు, పట్టణాల్లోని జనాభా ఆధారంగా అమలు చేస్తున్న ఇంటి అద్దెల అలవెన్సుల(హెచ్ఆర్ఏ) శాతాలను మాత్రం తగ్గించాలని పేర్కొంది. నెలరోజులుగా ఈ నివేదిక కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు అది చూడగానే మతిపోయింది.
ఫిట్‌మెంట్‌ను45 నుంచి 63 శాతం పెంచాలని తాము డిమాండ్ చేస్తే.. అతి తక్కువగా 7.5 శాతమే పెంచాలని సూచించడంపై మండిపడుతున్నాయి. గడచిన 45 ఏళ్లలో ఇదే అతితక్కువ ఫిట్మెంట్ అని గుర్తు చేస్తున్నాయి. 1974లో ఆర్.ప్రసాద్ ఆధ్వర్యంలోని పీఆర్సీ అతి తక్కువగా 5 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసింది. అప్పట్లో ప్రభుత్వం కూడా అంతే 5 శాతాన్ని ఉద్యోగులకు ప్రకటించింది.
ఆ తర్వాత ఏ కమిషన్ కూడా ఇంత తక్కువగా సిఫారసు చేయలేదు. తాజాగా 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడానికి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్నామని పీఆర్సీ వివరించింది. ఇంత తక్కువ శాతాన్ని సిఫారసు చేయడానికి కారణాలేంటో తెలిపింది.
ప్రజల ఆకాంక్షలు, లాక్డౌన్ ప్రభావం..
తెలంగాణ కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రమని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చాల్సి ఉండడంతో ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో నిధులను సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తోందని పీఆర్సీ పేర్కొంది. ‘నిరుడు కరోనా లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది. రెవెన్యూ రాబడులు మందగమనం పట్టాయి. ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా.. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని తక్కువ ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయక తప్పలేదు.
గత పీఆర్సీ 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేస్తే ప్రభుత్వం 14 శాతం పెంచి 43 శాతాన్ని ప్రకటించింది’ అని ప్రస్తావించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలో మరో ఇద్దరు రిటైర్డు ఐఏఎస్‌లు సి.ఉమామహేశ్వరరావు, మహమ్మద్ అలీ రఫత్లు సభ్యులుగా ఏర్పాటైన ఈ పీఆర్సీ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి 501 వినతిపత్రాలు స్వీకరించింది. సచివాలయ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలు, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో మొత్తం 345 సమావేశాలను నిర్వహించింది.
ఆర్థిక శాఖ, అర్థగణాంక డైరెక్టరేట్, కేంద్ర పే రివిజన్ కమిషన్లు, రాష్ట్ర పే రివిజన్ కమిషన్ల నివేదికలు, సర్వేలను ఆధారంగా చేసుకుని ఫిట్మెంట్, కనీస వేతనాలు, హెచ్ఆర్ఏ వంటి అంశాలను ప్రకటించింది. రాష్ట్రంలోని అటెండర్ నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు ఉన్న 32 గ్రేడ్లు, 82 సెగ్మెంట్ల వారీగా మాస్టర్ స్కేళ్లను ప్రతిపాదించింది. మూలవేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్, 30.392 శాతం కరువు భత్యం(డీఏ)ను కలిపి మాస్టర్ స్కేళ్లను నిర్ధారించింది.
ప్రతి ఏడాదికి రెండుసార్లు డీఏ పెంపు యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. వార్షిక ఇంక్రిమెంట్‌కు నిర్దేశిత గడువును నిర్ణయించింది. ఒకసారి పెరిగిన ఇంక్రిమెంట్ మూడేళ్లపాటు అమల్లో ఉంటుందని తెలిపింది. 7.5 శాతం ఫిట్మెంట్ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ.1272 కోట్ల భారం పడుతుందని పీఆర్సీ వెల్లడించింది. సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు, స్పెషల్ పే, మెడికల్ అలవెన్సు అన్నీ కలిపి ఖజానాపై రూ.2252 కోట్ల భారం పడుతుందని వివరించింది.
ఉద్యోగుల ఇంటి అద్దెల (హెచ్ఆర్ఏ)ను తగ్గించింది. ప్రభుత్వం వీటిని నాలుగు శ్లాబులుగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రస్తుతం 30 శాతం, 20 శాతం, 14.5 శాతం. 12 శాతంగా ఇంటి అద్దెలు అమల్లో ఉన్నాయి. వీటిని పీఆర్సీ 24శాతం, 17శాతం, 13 శాతం, 11 శాతానికి తగ్గించింది.
పీఆర్సీ ప్రతులను చించేసిన ఉద్యోగులు
పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యోగులకు ఫిట్మెంట్ 7.5ు ఇవ్వాలని ప్రతిపాదించడం దారుణమని మండిపడ్డాయి. గత 10 పీఆర్సీల సిఫారసుల కన్నా.. తెలంగాణ తొలి పీఆర్సీ సిఫారసులు హీనంగా ఉన్నాయని ధ్వజమెత్తాయి. పీఆర్సీ నివేదికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలన్నీ ప్రకటించాయి. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ఫిట్మెంట్ శాతాన్ని పెంచుతూ ప్రకటన చేయాలని డిమాండ్ చేయి. పీఆర్సీ నివేదికను వ్యతిరేకిస్తూ తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక సచివాలయం వద్ద బుధవారం ఆందోళన చేసింది.
కొందరు ఉద్యోగులు పీఆర్సీ నివేదిక ప్రతులను చించివేయగా.. మరికొందరు వాటిని దహనం చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ‘‘మాయదారి పీఆర్సీ మాకొద్దు. 7.5ు ఫిట్మెంట్-సిగ్గు సిగ్గు’’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సచివాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. నివేదిక ప్రతులను దహనం చేస్తుండగా వాటిని లాక్కున్నారు.
63 % ఫిట్మెంట్ ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోఏ) డిమాండ్ చేసింది. కనీస వేతనాన్ని 24 వేలకు పెంచాలని పేర్కొంది. 30 నెలలకుపైగా కాలయాపన చేసి.. తీరా ఫిట్‌మెంట్‌ను 7.5 % ప్రకటించడం సిగ్గుచేటని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) మండిపడింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత దారుణమైన ఫిట్‌మెంట్‌ను చూడలేదని విమర్శించింది.
ఈ నివేదికను తిరస్కరిస్తున్నామని, సీఎం కేసీఆర్ ఇప్పటికైనా చొరవ తీసుకుని మెరుగైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశాయు. తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. దీంతో వారితో చర్చలు జరపాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఆయన వివిధ సంఘాలతో విడతలవారీగా చర్చించారు. కానీ 7.5 శాతం ఫిట్‌మెంట్‌కు ఉద్యోగులు అంగీకరించలేదు. సీఎంను కలిసేందుకు వారు అపాయింట్మెంట్ అడిగినా ఇంతవరకు ఇవ్వలేదు.