రాజకీయం అన్న తర్వాత ఇష్టారాజ్యంగా మాట్లాడటం అన్నది అస్సలు ఉండకూడదు. అందులోకి కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. కీలక నేతల నోటి నుంచి వచ్చే మాటల ప్రభావం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గతంలో నేతలు చేసిన తప్పులకు వారు ప్రాతినిధ్యం వహించే పార్టీలు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అవసరం లేని వేళ.. అనవసర వ్యాఖ్యలు చేయకూడదన్న ప్రాథమిక విషయాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి మర్చిపోతు
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరికి వారు వారి ప్రయత్నాలు చేస్తూ.. గెలుపు బాట పట్టేందుకు అవసరమైన అన్ని మార్గాల కోసం వెతుకుతున్నారు.
ఈ ఉప ఎన్నికల్లో విజయం ప్రధాన రాజకీయపార్టీలైన ముగ్గురికి అత్యవసరం కావటం.. దాని ప్రకారమే ఫ్యూచర్ రాజకీయం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి వేళలోనే.. మంత్రి జగదీశ్ రెడ్డి నోటి నుంచి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈడీలకు.. బోడీలకు తాము భయపడే ప్రసక్తే లేదన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను గల్లీ లీడరుగా అభివర్ణించారు. మునుగోడులో బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందన్నారు. మోడీ ఇచ్చిన అక్రమ సంపాదనతో కోట్లు కుమ్మరించి గెలవాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నారన్నారు. బీజేపీ దుర్మార్గాల్ని బయటపెట్టే శక్తి ఉన్న దమ్మున్న నాయకుడు దేశంలోనే కేసీఆర్ ఒక్కరే అంటూ వ్యాఖ్యానించారు.
జగదీశ్ నోటి నుంచి వచ్చిన మాటల్లో అవసరం లేని అనవసర వ్యాఖ్య ఏమంటే..బీజేపీ మూడో స్థానంలో నిలుస్తుందని. రేపొద్దున రెండో స్థానంలో నిలిస్తే.. టీఆర్ఎస్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక.. బండి సంజయ్ గల్లీ నేతగా అభివర్ణిస్తున్న జగదీశ్.. నిజంగా ఆయనది అదే స్థాయి అయితే.. మంత్రి స్థానంలో ఉన్న జగదీశ్ ఆయన గురించి అంతలా ఎందుకు మాట్లాడుతున్నట్లు? అన్నది ప్రశ్న.
ఇలా అహంభావం కొట్టొచ్చినట్లుగా కనిపించే జగదీశ్ మాటలు.. పార్టీకి ఇబ్బందికరంగా మారతాయంటున్నారు. అంతేకాదు.. హుజురాబాద్ లోనూ ఇలాంటి మాటలే ఇష్టారాజ్యంగా మాట్లాడేసి.. అయ్యో పాపం ఈటల అంటూ సానుభూతి పెంచేలా చేసిన కారణంగా ఉప ఎన్నిక తుది ఫలితం ఎలా వచ్చిందో తెలిసిందే. అదంతా చూసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్లీ ఆ తరహా మాటలు అవసరమా? అన్నది ప్రశ్నగా మారింది.