పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ గాయపడిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో తనపై దాడి జరిగిందని, తన కాలికి గాయమైందని దీదీ ఆరోపిస్తుంటే….అదంతా డ్రామా అని బీజేపీ నేతలు అంటున్నారు. ఆ ఘటనపై ఈసీ నియమించిన అధికారలు కూడా అక్కడ దాడి జరిగినట్టు ఆధారాలు లేవని, కారు డోర్ మూసుకుపోవడం వల్లే దీదీ కాలికి గాయమైందని నివేదికనిచ్చారు.
ఈ నేపథ్యంలోనే తాను అన్నమాట ప్రకారం దీదీ వీల్ చైర్ నుంచే ప్రచారం మొదలుపెట్టారు. 4 రోజుల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చిన దీదీ…వీల్ చైర్ నుంచి రోడ్ షో నిర్వహించి బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని ‘కేజీఎఫ్’ చిత్రంలోని పాపులర్ డైలాగ్ తరహాలో బీజేపీని దీదీ హెచ్చరించారు. తాను గాయపడ్డ పులినని, ఇకపై తనతో పోరాటం మరింత ప్రమాదకరమని బీజేపీకి కేజీఎఫ్ రేంజ్ లో దీదీ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
2007లో నందిగ్రామ్‌లో రసాయన ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం జరిపిన భూ సేకరణ రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. నాడు పోలీసు కాల్పుల్లో మరణించిన 14 మంది గ్రామస్తుల స్మృత్యర్థం నందిగ్రామ్ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీదీ 5 కి.మీ. రోడ్ షోలో పాల్గొన్నారు. వీల్ చైర్ లోనే ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిన దీదీ…ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో బీజేపీపై నిప్పులు చెరిగారు.
తనపై ఎన్నో సార్లు దాడులు జరిగాయని, ఏనాడు ఎవరికీ తలవంచలేదని దీదీ అన్నారు. తన కాలికి అయిన గాయాన్ని ప్రజలకు చూపిస్తూ…గాయపడ్డ పులి మరింత ప్రమాదకారి అంటూ బీజేపీకి మమత హెచ్చరికలు జారీ చేశారు. వైద్యులు తనను విశ్రాంతి తీసుకోమన్నారని, ఎలాగైనా ఇవాళ ప్రజల ముందుకు రావాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చానని చెప్పారు. కేంద్రం నియంతృత్వ విధానాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వాటి ముందు తన బాధ చాలా చిన్నదని మోడీ సర్కార్ పై దీదీ ధ్వజమెత్తారు.
కాగా, నందిగ్రామ్ ఘటన నేపథ్యంలో మమత భద్రతా అధికారిపై ఈసీ వేటు వేసింది. ఆ దాడికి బాధ్యతగా మమత భద్రతా డైరెక్టర్, ఐపీఎస్ అధికారి వివేక్ సహాయ్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బందోబస్తు సరిగా నిర్వహించనందుకు పూర్వ మిడ్నాపూర్ ఎస్పీ ప్రవీణ్ ప్రకాశ్‌ని సస్పెండ్ చేసింది.