ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికల వేడి ఆల్రెడీ రాజుకున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీట్లు ఖరారైన అభ్యర్థులు సన్నాహాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.
ఇందులో భాగంగానే మంగళగిరిలో ‘సంజీవని ఆరోగ్య రథం’ పేరుతో మొబైల్ ఆసుపత్రిని నారా లోకేష్ కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక, అల్లుడు నారా లోకేష్ నుంచి స్ఫూర్తి పొందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన నియోజకవర్గంలో ‘ఎన్టీఆర్ ఆరోగ్య రథం’ ప్రారంభించారు. ఈ ఆరోగ్య రథంలో అత్యాధునికి చికిత్సా పరికరాలు, పరీక్ష యంత్రాలు, ఎమర్జెన్సీకి అవసరమైన సామాగ్రిని తన సొంత ఖర్చులతో సమకూర్చారీ మామా అల్లుళ్ళు.
అంతేకాదు, ఈ వాహనంలో ఒక జనరల్ ఫిజీషియన్ అయిన డాక్టర్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ ఆరోగ్య రథం దగ్గరే దాదాపుగా 200 మందికి పైగా రోగులకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షలతో పాటు మందులు కూడా పూర్తి ఉచితంగా అందజేస్తున్నారు. ‘అందరికీ ఆరోగ్యమస్తు ప్రతి ఇంటికీ శుభమస్తు’ అనే నినాదంతో మామ అల్లుళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమానికి విపరీతమైన స్పందన వస్తోంది.
దాదాపు 40 లక్షల రూపాయల ఖర్చుతో బాలకృష్ణ, లోకేష్ లు ఈ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ ఉచిత ఆరోగ్య రథాల ద్వారా మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన వంటి సదస్సులను కూడా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏ ఏ గ్రామంలో ఈ ఆరోగ్య రథం పర్యటించబోతుందో ముందుగానే తెలియజేస్తున్నారు. ఒకవేళ ఆరోగ్య రథం దగ్గర నయం చేయలేని వ్యాధులను వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.
హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాలలో ప్రారంభించిన ఈ కార్యక్రమంపై నియోజకవర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి వద్దకే వైద్యాన్ని అందిస్తున్న మామాఅల్లుళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీదే గెలుపు అని కార్యకర్తలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్న మామాఅల్లుళ్ళపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బాలకృష్ణ, లోకేష్ లను స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు టీడీపీ నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో ఈ ఉచిత ఆరోగ్య రథాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.