సీఎం వైఎస్ జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి నుంచి తనను తప్పించడంతో జగన్ పై బాలినేని గుర్రుగా ఉన్నారని టాక్ వచ్చింది. అప్పటి నుంచి బాలినేని చురుగ్గా పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత తనపై సొంత పార్టీ నేతలే కుట్రలకు పాల్పడుతున్నారని బాలినేని షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. సొంత పార్టీలోనే తనపై కుట్రలు చేస్తున్న వారెవరో తనకు తెలుసన్న బాలినేని…వాళ్ల సంగతి చూస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.
దీంతో, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను బాలినేని స్వీకరించడంతో ఆ పుకార్లు నిజమని ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై బాలినేని స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని, తాను జనసేనలోకి వెళ్తున్నానని తప్పుడు ప్రచారం జరుగుతోందని బాలినేని అన్నారు. తనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని, ఎన్ని కష్టాలు వచ్చినా తాను జగన్ వెంటే ఉంటానని అన్నారు.
అంతేకాదు, వైసీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా జగన్ వెంటే నడుస్తానని చెప్పారు. ఇక, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా జగన్ తనకు 22 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారని, ఆ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. పార్టీలో సమన్వయం కోసం తాను పని చేస్తున్నానని, ఇందులో భాగంగానే గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశానని బాలినేని చెప్పారు. చేనేత వస్త్రాలకు మద్దతుగా పవన్ కల్యాణ్ తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే… తాను మద్దతు ప్రకటించానని, చేనేత కార్మికుల కోసం గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలను చేశామని అన్నారు.
Comments 1