ఈ మధ్యకాలంలో వైసీపీ అధినేత జగన్ పై, ఆ పార్టీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ ను కూడా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కు మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్ విసిరారు. పవన్ సినిమాల్లో హీరో అని, సినిమా వేరు రాజకీయం వేరని, తనతో పాటు పవన్ మూడు కిలోమీటర్లు నడవగలరా అని ధర్మాన ఛాలెంజ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో మంత్రి ధర్మాన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఈ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికకు సమీపంలో పవన్ కల్యాణ్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఉన్నాయి. వాటిలో స్థానిక యువకుల ఫొటోలు కనిపించాయి. దీంతో, అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాన…పవన్ పై విమర్శలు గుప్పించారు. సినిమాలో నటిస్తారని, పవన్ నడుస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చేశారని ఎద్దేవా చేశారు.
ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలను గుర్తించాలని, ఇలా ఫొటోలకు పోజులిస్తే కుదరదని ధర్మాన ఆ యువకులనుద్దేశించి అన్నారు. నా వయసు 64 ఏళ్లు..ఏదీ నాతో నడవమనండి చూద్దాం అంటూ పవన్ కు ఛాలెంజ్ చేశారు. తనతోపాటు పవన్ కనీసం 3 కిలోమీటర్లు కూడా నడవలేరంటూ సవాల్ విసిరారు. సినిమాలలో నటించినంత సులభంగా ప్రజా జీవితం ఉండదని ధర్మాన అన్నారు.
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని, రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులుంటాయని గ్రహించాలని సూచించారు. అధికారం, పదవులు పట్టించుకోకుండా నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని చెప్పారు. అయితే, సాధారణంగా రాజకీయ విమర్శలు, వివాదాలకు దూరంగా ఉండే ధర్మాన ఇలా పవన్ పై కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది. అయితే, పదవి వస్తే అంతేనని, మంత్రి అయిన తర్వాత ధర్మాన తీరు మారిందని విమర్శలు వస్తున్నాయి.