పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ లు వేయకుండా ప్రత్యర్థి అభ్యర్థులను బెదిరించడం మొదలు….అర్థరాత్రి చీకట్లో కౌంటింగ్ లో ఫలితాలు తారుమారు చేయడం వరకు వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడిందని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే పంథాను వైసీపీ నేతలు కొనసాగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలకు అదనపు మార్గదర్శకాలను నిమ్మగడ్డ జారీ చేశారు. 10 కంటే తక్కువ మెజారిటీ ఉన్నప్పుడే రీకౌంటింగ్ కు అనుమతించాలని నిమ్మగడ్డ ఆదేశించారు. అంతేకాకుండా, రాత్రి 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియ ముగించాలని ఆదేశించారు.
కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, విద్యుత్ కు అంతరాయం కలగకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు, కౌంటింగ్ ప్రక్రియ వీడియో ఫుటేజిని ఎన్నికల రికార్డుగా భద్రపరచాలని ఆదేశించారు.
కాగా, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఎస్ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ వాయిదా పడింది. హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత,144 సెక్షన్ ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను మోహరించనున్నారు.