‘తానా’ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసి ప్రచారపర్వం మెల్లగా మొదలై క్రమంగా జోరందుకుంటోంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతున్న డిజిటల్, సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ ప్రచారాలతో బెంబేలెత్తుతున్న ‘తానా’ సభ్యులకు ‘నిరంజన్’ మరియు ‘కొడాలి’ వర్గాల పర్యాటనలు ఒక రకంగా సందడి వాతావరణం తెచ్చినప్పటికీ ఇంకో రకంగా ఇబ్బందికరంగా కూడా మారాయి. రెండు వర్గాలు ఈ పర్యటనలను తమ టీం మెంబెర్స్ మధ్యన సమన్వయం కమ్యూనిటీ లతో కనెక్షన్లకు అలాగే స్పందన పరిశీలనకు ఉపయోగించుకొంటున్నారు. వర్గాలకు సంబందించిన జాతీయ మరియు స్థానిక నాయకులు ఫోనులు చేసి ఆహ్వానిస్తున్నప్పుడు ‘తానా’ సభ్యులు అటు కాదనలేక, ఎటువెళ్లినా రెండో వర్గము తో సమస్యలే కాక, కోవిడ్ సమయము లో కుటుంబాన్ని రిస్కులో పెట్టలేక సతమతమవుతూ సాకులు వెదుక్కుంటున్నారు. దానికి తోడు అల్రెడీ జరిగిన సమావేశాల్లో కొంతమందికి ‘కోవిడ్ పాజిటివ్’ వచ్చినట్లు తెలియడంతో ఊళ్ళో లేకుండా పోవటం బెటర్ అని కూడా కొంతమంది భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు పోటీ చేసినప్పుడు అన్ని ప్రాంతాలూ అల్రెడీ సందర్శించడమే కాక ‘మన ఊరి కోసం’ ప్రోగ్రాం కోసం కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి అందరితో పరిచయాలు పెంచుకుని ఉన్న ‘గోగినేని’ ప్రస్తుత పరిస్థితుల్లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’, ‘కాంపెయిన్ ఫ్రమ్ హోమ్’ అంటూ ఇచ్చిన కోవిద్ అడ్వైసరీ నోట్ చాలా మందికి నచ్చింది.
ఇక ప్రెసిడెంట్ అభ్యర్థులు గాక మిగతా పదవులకు పోటీ పడ్తున్న వారు కూడా తమదైన పంధాలో ప్రచార హోరులో తలమునకలై ఉన్నారు. కొంతమంది అనవసర ఖర్చులకు పోతుండగా, మరికొంతమంది నిమ్మకు నీరెత్తినట్టు, వర్గాల బలంతో గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. వీరిలో మరీ ఉత్సాహవంతులు రెండో వర్గంతో కూడా డీల్ కుదుర్చుకునే విధంగా మధ్వవర్తులతో మంతనాలాడుతున్నారు. ఇంచుమించు అందరూ తమ వర్గ నాయకుల్తో పాటు, ఇతర సంస్థలు , కుల సంఘాలు మరియు స్థానిక సంఘాలకు చెందిన నాయకులను సంప్రదిస్తూ మద్దతు కోరుతున్నారు. అయితే సభ్యులు కూడా మరింత తెలివిగా అందరితో మాట్లాడుతూ చాల సందర్భాల్లో ప్రత్యర్థులందరికీ అభయమిచ్చి శాంతపరుస్తూ ఆశలు కల్పిస్తున్నారు. వర్గాలు వెళ్లిన ప్రతి చోట బాలట్ కలెక్షన్లు ఏ విధంగా చేయవచ్చో, ఆలోచిస్తూ విధి విధానాలు కూడా సమీక్షించుకొంటున్నారు. వెరసి ఈ ఎన్నికల ప్రచార తంతు ఒక సేవా సంస్థ లా గాక ఒక ఫక్తు రాజకీయ పార్టీల ఎన్నికల వ్యవహారంలాగా అనిపిస్తోంది. విచిత్రమేమిటంటే రెండువర్గాలు మంది తో కల్సి ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ సుడిగాలి పర్యటనలు చేసుకుంటున్నామనుకుంటుంటే వారికి, ముఖ్యంగా ప్రెసిడెంట్ అభ్యర్థులకు, ‘గోగినేని’ రూపంలో ఎదురు గాలి తగులుతూ దాని ప్రభావం మరియు లోతు తెలియక తికమక పడ్తున్నారు. ముందు ప్యానెల్ లేదని తేలిగ్గా తీసేద్దామని అనుకుంటే బాలట్ కలెక్షన్స్ పైన అలాగే రెండు వర్గాల పోరు సంస్థకు చేటు అంటూ ‘గోగినేని’ చేస్తున్న ప్రచారం సాధారణ సభ్యులను బాగా కదిలిస్తుండడంతో ‘నిరంజన్’, ‘కొడాలి’ వర్గాలు రెండూ ఎలా ఎదుర్కోవాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.
ఇక ‘ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్షులు’ ప్రత్యక్షముగా ఎన్నికలలో పాల్గొవడంపై చాల మంది సభ్యులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా అందరూ కలసి పోటీ లేకుండా పదవి ఇచ్చిన ‘తదుపరి అధక్షుడు లావు అంజయ్య చౌదరి’ ఇలా బహిరంగంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గోవడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతూ ‘నిరంజన్’ ప్యానెల్ కు లాభమో నష్టమో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ‘లావు బ్రదర్స్’ సుఖంగా ఉన్న తమ పరిస్థితిని కూల్ గా ఎంజాయ్ చేయక, తమ బలాన్ని అతిగా ఊహించుకొని, అవసరంకంటే ఎక్కువగా ‘వేలు పెట్టి తేలు’ కుట్టించుకున్న చందంగా పరిస్థితి తయారై, మొదటికే మోసం వచ్చే ప్రమాదం తెచ్చుకుంటున్నట్లే ఉంది. అభ్యర్థులంతా వారి స్వంత ప్రాంతమైన ‘అట్లాంటా’, పై దృష్టి సారించడంతో వీరికి ఇంటా బయటా కూడా పోరు మొదలైనట్లే. చతికిల పడిందనుకొన్న’నరేన్ ప్యానెల్’, కొద్ది రోజులుగా క్రమ క్రమంగా బలపడుతూ పోటీని రసవత్తరంగా మార్చినట్లే అనిపిస్తోంది. అడ్రస్ మార్పుల వ్యవహారం మరికొద్దిరోజులు పట్టేలా ఉన్న పరిస్థితుల్లో ‘తానా’ ఎన్నికల తేదీలు కూడా మరో 4 వారాలు వెనక్కు వెళ్లే పరిస్థితి నెలకొంది. దాంతో అభ్యర్థులందరికీ అదనపు ప్రచార సమయం దొరికింది.
‘నిరంజన్’ ప్యానెల్ ముందు నుంచి ఫీలవుతున్న ఆధిక్యత నుంచి బయటపడి క్రమ క్రమంగా పోటీ తీవ్రతను ఫీలవుతుండగా ప్రెసిడెంట్ అభ్యర్థి త్రిముఖ పోటీలో వెనక పడతాడేమో అన్న శంక చివరికి ప్యానెల్ కు కూడా ఇబ్బంది అవుతుందేమోనని కొంతమంది భయపడ్తుండగా, దీనిని కవర్ చేయడానికన్నట్లు ‘ప్రెసిడెంట్’, ‘వైస్ ప్రెసిడెంట్ ‘ లు తమ పరపతిని కూడా త్యాగం చేస్తూ ప్రచార పర్వం లో పాల్గొంటున్నారు. ఇక ‘నరేన్’ ప్యానెల్ ఇద్దరు ప్రముఖ అభ్యర్థులు నామినేషన్లను సక్రమంగా వేయలేక పోయినప్పటికీ జవసత్వాలు కూడదీసుకుని ప్రచారయాత్రకు బయలుదేరడంతో మద్దతుదారులలో ఉత్సాహం నెలకొని పోటీ వ్యూహాలతో పోరాటానికి పదును పెడుతున్నారు. వీరికి అధి నాయక త్రయం కూడా తోడవుతూ మద్దతు కూడ కడుతూ పర్యటనలు చేస్తున్నారు. రెండు వర్గాల ప్రచార సరళికి భిన్నంగా తన కున్న క్లీన్ ఇమేజీకి తోడు తన కమిట్మెంటుతోనూ, సీనియార్టీతోను, మేధాశక్తితోను చిత్ర విచిత్రమైన ప్రచార సరళితో ఓటర్లను ఆకట్టుకొంటూ సాగిపోతున్న ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభ్యర్థి ‘శ్రీనివాస గోగినేని’ తమ ప్యానెల్ లో ఉండి ఉంటే ప్రత్యర్థి వర్గం రాజీకి వచ్చిఉండేదని, ఎవరికీ శత్రువు కాని ఆయనను తెచ్చుకోలేక పోవడం తమ అధినాయకుల లోపము అని, ఇప్పుడైనా మించి పోలేదేమోనని కొంతమంది ముఖ్యులు ఆలోచన పడ్తున్నట్టు సమాచారం. ఏదేమైనా చాప కింద నీరులా మొదలైన ‘గోగినేని’ ప్రచారం క్రమ క్రమంగా ఉధృతమవుతూ ,రెండు వర్గాల ప్రెసిడెంట్ అభ్యర్థుల కొంప ముంచె ప్రమాదం ఉన్నట్లే అనిపిస్తోందని ఎక్కువమంది భావిస్తున్నారు. ఇంకా చివరి అంకమైన బాలట్ కలెక్షన్ల ఏర్పాటుపై ఇంతకు ముందులా సాధ్యము గాకపోవచ్చని, కలెక్ట్ చేసే వ్యక్తులు చీలిపోయిన కారణంగా కవర్లు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇస్తే ఎవ రు దూరం అవుతామో నని సభ్యలు కూడ సందేహ పడుతూ, ఓటు ఎవరికి వేయాలో చెపితే చాలు అని అంటున్నట్లు వినికిడి. చూద్దాం ఇంకా ఎన్నెన్ని వింతలూ ఎన్నెన్ని విశేషాలు జరుగుతాయో!!