బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. స్వపక్షం, విపక్షం, తన, మన తారతమ్యాలు లేకుండా…..నిర్మొహమాటంగా వ్యాఖ్యానించడం, విమర్శలు ఆయనకు పరిపాటి. 80 ఏళ్లు దాటిన మెట్రోమ్యాన్ శ్రీధరన్ ను కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ప్రకటించడంపై స్వామి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
శ్రీధరన్ తరహాలోనే అద్వానీ వంటి పెద్దలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని స్వామి డిమాండ్ చేయడంతో బీజేపీ హైకమాండ్ ఇరకాటంలో పడింది. ఇదిలా ఉంటే…. తాజాగా, ఈ ఫైర్ బ్రాండ్…ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి తిరుపతి వెళ్లడం…అక్కడ శ్రీవారి దర్శనం అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో భేటీ కావడం తెలిసిందే. ఇక, ఆ భేటీ తర్వాత విజయవాడలో సీఎం జగన్ ను కలిసిన స్వామి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లారు.
అయితే, ఈ క్రమంలోనే టీటీడీపై ఆంధ్రజ్యోతి తెలుగు దిన పత్రిక అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ స్వామి రూ.100కోట్ల పరువు నష్టం దావాను వేయడం చర్చనీయాంశమైంది. టీటీడీని స్వతంత్రంగా ఉంచాలని… టీటీడీలో రాజకీయ జోక్యం అవసరం లేదంటూ గట్టిగా చెబుతూ వస్తోన్న స్వామి…ఇపుడు వెంకన్న దర్శనంతోపాటు జగన్ దర్శనం చేసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
అయితే, జగన్ తో స్వామి భేటీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదితో స్వామి రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలోనే జగన్ ను స్వామి ప్రసన్నం చేసుకున్నారన్న టాక్ వస్తోంది. ప్రధాని మోడీ, అమిత్ షా సహా బీజేపీ పెద్దలపై కూడా విమర్శలు గుప్పిస్తోన్న స్వామిని బీజేపీ మరోసారి రాజ్యసభకు పంపుతుందో లేదో అనుమానమే. అందుకే, ఏపీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యేందుకు జగన్ తో స్వామి టచ్ లోకి వచ్చారని టాక్ వస్తోంది.
వచ్చే ఏడాది వైసీపీకి ఆరుగురిని రాజ్యససభకు పంపే చాన్స్ ఉంటుంది. వాటిలో ఒకదానిపై స్వామి కర్చీఫ్ వేసి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు రకాల కేసులు, పిటిషన్లతో సతమతమవుతోన్న జగన్…న్యాయశాస్త్రంలో కోవిదుడైన స్వామిని పక్కనబెట్టుకుంటే మంచిదని భావిస్తున్నారట. ఏపీలో తనకు స్వపక్షంలో విపక్షంగా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు బీజేపీ పెద్దల అండ ఉండడంతో తాను ఏమీ చేయలేకపోతున్నానన్న భావనలో జగన్ ఉన్నారట.
పక్కలో బల్లెంలా మారిన రఘురామ వల్ల తాను పడుతున్న ఇబ్బంది ఎలా ఉంటుందో బీజేపీకి తెలియజెప్పాలన్న ఉద్దేశ్యంతోనే బీజేపీకి కంటిలో నలుసులా మారిన స్వామిని జగన్ అక్కున చేర్చుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. అదీగాక, కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా స్వామిని విమర్శించాలంటే కాస్త ముందు వెనుక ఆలోచించే చాన్స్ ఉంది. దీంతో,స్వామిని నామినేట్ చేయాలని జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారట.
అయితే, ఇప్పటికే అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటోన్న జగన్… బీజేపీ పెద్దలను కాదని బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన స్వామిని చేరదీస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. స్వామికి జగన్ రాజ్యసభ టికెట్ ఇచ్చి రఘురామ ఎపిసోడ్ కు బీజేపీపై రివేంజ్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తారా లేదా అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.స్వామికి జగన్ రాజ్యసభ టికెట్? రఘురామ ఎపిసోడ్ కు బీజేపీపై రివేంజ్?