ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న గీత అమ్మానాన్నల అన్వేషణ ఎట్టకేలకు శుభం కార్డు పడినట్లే. పాక్ లో చిక్కుకుపోయిన మనమ్మాయిని మోడీ సర్కారు భారత్ కు తీసుకురావటం.. మూగదైన ఆమె తల్లిదండ్రుల్ని గుర్తించేందుకు దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా బాధ్యత తీసుకోవటం తెలిసిందే. మూగ.. చెవిటి అయిన గీత వయసు ఇప్పుడు 29 ఏళ్లు.తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె తప్పిపోవటం.. పాకిస్తాన్ కు చేరటం.. అక్కడో ఎన్జీవో ఆమెను చేరతీసింది.
పెరిగి పెద్దదైన ఆమె గురించి వివరాలు మీడియాలో రావటంతో స్పందించిన అప్పటి విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ ఆమెను ప్రత్యేకంగా భారత్ కు రప్పించారు. ఆమెకు ఆశ్రయాన్ని ఇస్తున్న ఆనంద్ సర్వీస్ సొసైటీతో కలిసి ఆమె తల్లిదండ్రుల కోసం దేశ వ్యాప్తంగా జల్లెడ పట్టారు. ఐదేళ్లుగా పడుతున్న వారి శ్రమ ఫలించింది. తాజాగా గీత తల్లిని మహారాష్ట్రలో గుర్తించినట్లుగా సదరు ఎన్జీవో పేర్కొంది.గీత గురించి ఆమె తల్లి మీనా వాకబు చేయటం.. ఈ సందర్భంగా ఎన్జీవో అడిగిన ప్రశ్నలకు అన్ని సరైన సమాధానాలు చెప్పినట్లుగా పేర్కొన్నారు.తన కుమార్తె పొట్టపై కాలిన మరక ఉంటుందని మీన చెప్పటం.. అది నిజమేనని సదరు ఎన్జీవో చెబుతోంది.
అంతేకాదు.. గీత అసలు పేరు రాధ అని.. తాము పర్భనీ జిల్లాలోని జింతూరులో ఉండేవాళ్లమని గీత తల్లి పేర్కొంది.గీత తండ్రి సుధాకర్ కొన్నేళ్ల క్రితం మరణించారని.. తర్వాత గీత తల్లి రెండో పెళ్లి చేసుకొని ఔరంగాబాద్ లో ఉంటున్నారు. అయితే.. గీత తల్లిగా గుర్తించిన మీనాకు డీఎన్ ఏ పరీక్ష చేయలేదు. త్వరలో అది కూడా పూర్తి చేసి.. ఫలితాలు సానుకూలంగా వస్తే.. ఆమె తల్లిని సాంకేతికంగా గుర్తించినట్లు అవుతుందని చెబుతున్నారు. మొత్తంగా సుదీర్ఘంగా సాగుతున్న గీత పేరెంట్స్ అన్వేషణ ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెప్పక తప్పదు.