జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అసంతృప్తితోనే సినీనటుడు మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీకి పురికొల్పిందా ? చాలాకాలంగా చంద్రబాబుతో మోహన్ బాబుకు మంచి సంబంధాలు లేవు. మొదట్లో కలిసే ఉన్నారు తర్వాత విడిపోయారు. కలవటం, విడిపోవటం మళ్ళీ కలవటం వీళ్ళిద్దరికీ అలవాటే. బహుశా ఇపుడు కూడా అదే పద్దతిలో కలుసుంటారు. చంద్రబాబు ఇంటికి వెళ్ళిన మంచు హీరో సుమారు గంటన్నరపాటు భేటీ అయ్యారు.
వీళ్ళిద్దరు ఇంతసేపు భేటీ అయ్యారంటే కచ్చితంగా రాజకీయాలపైన చర్చ జరిగే ఉంటుంది. కాకపోతే ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారనే విషయం తెలియటానికి కాస్త టైం పడుతుందంతే. అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఏమిటంటే జగన్ పై మోహన్ బాబులో కొంతకాలంగా అసంతృప్తి పెరిగిపోతోంది. వైసీపీ అఖండ మెజారిటితో అధికారంలోకి రాగానే మోహన్ బాబు ప్రభుత్వం నుండి చాలానే ఆశించుంటారు. అప్పటికే ఆగిపోయిన ఫీజు రీఎంబర్స్ మెంటు కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయట.
అలాగే ప్రభుత్వపరంగా కీలకమైన పోస్టును కూడా మోహన్ బాబు ఫ్యామిలీ ఆశించిందనే ప్రచారం జరిగింది. అయితే ఏ రూపంలోను జగన్ నుండి హీరోకు ఆదరణ దక్కలేదు. ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో ఈ హీరోలో అసంతృప్తి పెరిగిపోయింది. దాంతో వైసీపీలో ఉండీ ఇక లాభం లేదని అర్ధమైపోవటంతోనే మళ్ళీ టీడీపీలోకి ప్రవేశించాలని మోహన్ బాబు అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
షెడ్యూల్ ఎన్నికలు ఇంకా రెండేళ్ళున్న సమయంలో మోహన్ బాబు టీడీపీలో చేరుతారా ? జగన్ కు వ్యతిరేకంగా పనిచేయబోతున్నారా ? అనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. నిజానికి మోహన్ బాబు వల్ల టీడీపీకి ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఉపయోగం సంగతి పక్కనపెట్టేసినా నష్టం జరగకుండా ఉంటే అదే పదివేలు. ఎందుకంటే మోహన్ బాబు బాడీ లాంగ్వేజ్ ఎవరితోను పడదు. ముక్కుసూటిగా మాట్లాడుతానని అనుకుంటునే అనవసర విషయాలు బాగా మాట్లాడుతారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి టీడీపీ జాగ్రత్తగా ఉండాల్సిందే.