ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కానీ అధికారులకు ఇవేవీ పట్టడం లేదు. రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి గతంలో చాలాసార్లు వివాదాలు రేగాయి. ప్రధాన ప్రతిపక్షం రోజూ రోడ్లపై గొడవ చేస్తోంది. జనసేన ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. వీటి తర్వాత గుడ్ మార్నింగ్ సీఎం పేరిట కొన్ని నిరసనలు కూడా ఇటీవల జరిగాయి.
వీటన్నిటి దృష్ట్యా ఎలా అయినా రోడ్లను బాగు చేయాలని కొన్ని రోడ్లను విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కొంతమేర ఉపశమనం ఇస్తుందని అనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు ప్రయత్నాలు చేసింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణాలు పొందేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావడంతో 1000 కోట్ల రూపాయలతో ప్రథమ దశలో పనులు చేపట్టేందుకు నిర్ణయించారు.
ఇందులో భాగంగా బ్యాంకు నుంచి కొంత రుణం కూడా పొందారు రోడ్ల పనులకు సంబంధించి టెండర్లు కూడా పిలిచారు. బ్యాంకు నుంచి తొలి విడతగా 225 కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసింది. ఈ రుణం సంబంధించి పనులు చేపట్టాల్సి ఉన్న ఎక్కడ సంబంధిత పనులు మొదలు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో రోడ్లు పరమ అధ్వానంగా ఉండడంతో ఎలా అయినా విపక్షాల దాడులనుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం చేసినటువంటి తొలి ప్రయత్నం ఈ విధంగా బెడిసి కొట్టింది.
నిధులు ప్రభుత్వ ఖాతాలకు జమ అయినా సంబంధిత పనులు కొన్నిచోట్ల కొద్దిగానే ప్రారంభమైన మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగా ఖజానాలో సంబంధిత నిధులు మళ్లింపు చేయడం కారణంగా పనులు ఆగిపోయాయి. దీంతో పనులు చేపట్టేందుకు తొలిదశలో ఆసక్తి చూపిన వాళ్లంతా వెనక్కు మళ్లారు. కొద్దిపాటి పనులుకే బిల్లులు రాకపోవడంతో దాదాపు 80 కోట్ల రూపాయలకు పైగా బిల్లులకు మోక్షం లేక పోవడంతో కాంట్రాక్టర్లు చుక్కలు చూస్తున్నారు.