వైసీపీ ఏడాది పాలనపై ఏడు నెలల తర్వాత ప్రచారార్భాటం
ఇంటింటికీ రెండేసి కలర్‘ఫుల్’ బ్రోచర్లు
దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. పెళ్లి తంతు ముగిశాక బాజాబజంత్రీలు మోగించినట్లుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏడాది పాలన పూర్తయి ఏడు నెలలు దాటింది. ఇప్పుడు ఆకస్మికంగా దానిపై ప్రచారం చేసుకోవాలని సంకల్పించింది. సొంత పత్రిక, చానల్లో ప్రచార ప్రకటనలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గుమ్మరిస్తున్నా సంతృప్తి కలిగినట్లు లేదు. ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలని భావించింది.
కళ్లు చెదిరేలా రెండు కలర్ఫుల్ బ్రోచర్లను ముద్రించి ఇంటింటికీ పంచబోతోంది. ఊరూరా సచివాలయాలు, వాడవాడలా వలంటీర్లు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వీరి ద్వారానే నడుస్తున్నాయి. గడపగడపకు వీరే అనుసంధానకర్తలు. తమ ఘనతను ఇంకా.. ఇంకా చాటుకోవడానికి ఏకంగా రూ.24.62 కోట్లు ఖర్చుపెట్టనుంది. సదరు బ్రోచర్ల నిండా.. ఏడాది పాలనలో తమ పథకాలు, హామీల అమలుపై ఊదరగొట్టారు. నిజానికి జగన్ సర్కారు కొలువుదీరి నిరుడు మే 30 నాటికి ఏడాది పూర్తయింది.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ఏడాది పాలనలో ప్రజలకు జగనన్న చేసిన మేలు ఏమిటో సొంత మీడియాలో, అస్మదీయ మీడియాలో ప్రకటనలు గుప్పించారు. ప్రజలకు మరింత నేరుగా తెలియజెప్పేందుకు రెండు రకాల బ్రోచర్లు తెలుగు భాషలో ముద్రించి వాటిని ప్రజలకు పంపించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. అందులొ మొదటిది ‘గుండెల నిండా జగనన్న అజెండా’. ఇది మొత్తం 16 పేజీల్లో మినీ పుస్తకంలా ఉంటుంది. రెండోది ’‘తొలి ఏడు జగనన్న తోడు’’. ఈ బ్రోచర్ ఆరు పేజీల్లో ఉంటుంది. ఒక్కోటీ కోటి కాపీల చొప్పున రెండు కోట్ల కాపీలుగా ముద్రించారు.
ఇలా రెండు కాపీలను 40 మెక్రాన్ బరువుగల కలర్పుల్ కవర్లో పెట్టి ప్రజలకు ఇంటికే పంపుతున్నారు. రెండు రకాల బ్రోచర్లు, వాటికోసం రూపొందించే ప్రత్యేక కవర్ కోసం రూ. 24,62,40,000 ఖర్చుపెట్టనున్నారు. ఈ మొత్తం బాధ్యతను రాష్ట్ర ప్రణాళిక శాఖ పరిధిలోని స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్)కి అప్పగించారు. అయినా బ్రోచర్ల ఖరీదు 24 కోట్లా? ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కచ్చితంగా లబ్ధిదారులు, ప్రజలకు చేరాలి.
ఇందుకు ఆయా శాఖలు ఎలాగూ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పుడు గ్రామాలు, పట్టణాల్లో సచివాలయాలు వచ్చాయి. వార్డు వలంటీర్లు వచ్చారు. ప్రతి ప్రభుత్వ స్కీమ్ వారి ద్వారా ప్రజలకు చేరుతోంది. ఇంకా కావాలంటే గ్రామ, వార్డు స్థాయిల్లో సభలు ఏర్పాటు చేసుకోవచ్చు. పట్టణాల్లో సభలు నిర్వహించుకోవచ్చు. లబ్ధిదారులతో నిరంతరం సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ప్రభుత్వ సమాచారం ప్రజలకు చేరడానికి మొబైల్ సందేశాలు వినియోగిస్తున్నారు.
ఇవన్నీ ఉన్నా సొంత పత్రిక, మీడియాలో కలర్పుల్ ప్రకటనలు ఇస్తున్నారు. వీటికే కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నాయి. సగటున ఒక్కో మొదటి పేజీ ప్రకటనకే కనీసం కోటిన్నరపైనే ఖర్చవుతోంది. గత ఏడాదిన్నర కాలంలో ప్రకటనలపైనే 50 కోట్లకు మించి ఖర్చుపెట్టారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు బ్రోచర్ల ముద్రణకు 24.62 కోట్లు ఖర్చుపెట్టబోతున్నారు.
ప్రజలకోసం ప్రభుత్వం చేస్తోన్న మంచి ఏమిటో తెలియజేయడానికి కోట్లు ఖర్చుపెట్టాల్సిందేనా? ఇప్పటికే తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సర్కారు ప్రచారం కోసం కోట్లరూపాయలు ఖర్చుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ‘ఏడాది పాలనపై జూన్ లేదా జూలైలో ప్రచారం చేసుకుంటారు. ఏకంగా ఏడు నెలల తర్వాత ఏడాది పాలన అంటూ 24.62 కోట్లతో ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది’ అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.