సీనియర్ నటిగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన రాధికను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నోసినిమాలు చేసిన ఆమె.. కొన్నేళ్ల క్రితం బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటటం తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా అక్కడి రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఇలాంటివేళ రాధిక నోట ఆసక్తికర మాట వెలువడింది. ఏఐఎస్ఎంకే వ్యవస్థాపకుడు కమ్ భర్త కమ్ సీనియర్ నటుడైన శరత్ కుమార్ ఆదేశిస్తే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
భర్త ఆదేశించాలన్న ఆమె మాట ఆసక్తికరంగా మారితే.. ఇప్పటికే ఆమె కోసం తెన్ కాశీ.. వేలచెర్రి నియోజకవర్గాల్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. శరత్ కుమార్ కు భయం అన్నదే లేదని.. ప్రేమ.. అప్యాయతలకు మాత్రమే ఆయన లొంగుతారన్నారు. తాజాగా జరిగే ఎన్నికలతో మార్పు వస్తుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. తమ నేత పోటీ చేయమంటే ఎన్నికల బరిలోకి దిగేందుకు రెఢీ అన్నారు.
అన్నాడీఎంకేకు భాగస్వామిగా ఉన్న ఏఐఎస్ఎంకే తరఫున గత ఎన్నికల్లో తిరుచెండూర్ నుంచి శరత్ కుమార్ బరిలోకి దిగారు. ఆ సందర్భంగా భర్త విజయం కోసం రాధిక తెగ కష్టపడ్డారు. కానీ.. ఫలితం రాలేదు. ఆ ఎన్నికల్లో శరత్ కుమార్ ఓటమి పాలయ్యారు ఇదిలా ఉంటే.. తాజాగా జరిగే ఎన్నికల వేళ.. సరికొత్త రాజకీయ సమీకరణలు దిశగా పావులు కదులుతున్నాయి.
శరత్ కుమార్ పార్టీతో పాటు ఐజేకే పార్టీలు ఇటీవల కూటమిగా ఏర్పడగా.. కమల్ హాసన్ స్థాపించిన ఎంఎన్ఎంతో కలిసి ఎన్నికల బరిలో నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు శరత్ కుమార్ ప్రకటించారు. అంతేకాదు.. తమ కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ హాసన్ ను ప్రకటించిన ఆయన తీరు ఆసక్తికరంగా మారింది. మరి.. ఎన్నికల బరిలోకి రెఢీ అంటున్న భార్య రాధికను పోటీలోకి దించుతున్నారా? మూడో కూటమి ఎప్పటికి వాస్తవ రూపం దాలుస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.