‘ipac’ అధినేత ప్రశాంత్ కిషోర్ గురించి పరిచయం అక్కర లేదు. 2014లో ప్రధానిగా మోదీని, బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ను గద్దెనెక్కించడంలో పీకేదే కీలక పాత్ర అంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఒక్క యూపీ మాజీ సీఎం అఖిలేష్ మినహా ఇప్పటి వరకు పీకే ఎంతో మందిని సీఎంలను చేశాడు. రాజకీయ వ్యూహకర్తగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న పీకే, ఇపుడు మోడీ,నితీశ్ లతో విభేదించి వారిపై విమర్శలు గుప్పిస్తున్నాడు.
ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున రాజకీయ వ్యూహకర్తగా ఉన్న పీకే..దీదీని గెలిపించాలని కంకణం కట్టుకున్నాడు. బీజేపీకి బెంగాల్ లో రెండంకెల సీట్లు కూడా రావని పీకే బల్లగుద్ది మరీ చెప్పాడు. ఎన్నడూ లేని విధంగా ఓ పార్టీ తరఫున పీకీ వకాల్తా పుచ్చుకోవడం చర్చనీయాంశమైంది. ఆ చర్చ జరుగుతుండగానే పీకే మరో సంచలన చర్చకు తెర తీశాడు.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి 100 సీట్లొస్తే తాను ‘ipac’ కు ప్యాకప్ చెప్పి వేరే పని చూసుకుంటానని పీకే సంచలన ప్రకటన చేశాడు. పశ్చిమ బెంగాల్ లో వచ్చేది మమత ప్రభుత్వమేనని పీకే మరోసారి ఘంటాపథంగా చెప్పాడు. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వచ్చినా, బీజేపీకి వందకుపైగా సీట్లొచ్చినా తాను రాజకీయ వ్యూహకర్తగా తప్పుకుంటానని, ‘ipac’ కు ప్యాకప్ చెప్పి వేరే పని చూసుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తాను అన్నది జరగకపోతే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకీ సలహాలు, సూచనలు ఇవ్వబోనని పీకే కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
గతంలో ఉత్తరప్రదేశ్ లో తమ అంచనాలు తప్పి ఓడిపోయామన్న పీకే….బెంగాల్ లో ఆ సీన్ రిపీట్ కాదని తెగేసి చెప్పాడు. దీదీని గెలిపించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నానని, ఆ విషయంలో దీదీ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని అన్నాడు. ఒకవేళ బెంగాల్ లో దీదీ ఓడిపోతే రాజకీయ వ్యూహకర్త పనికి తాను అసమర్థుడినని ఒప్పుకొంటానని పీకే చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
టీఎంసీ తనంతట తాను పతనమైతే తప్ప బెంగాల్ లో బీజేపీ గెలవలేదని,అన్ని పార్టీల్లోలాగే టీఎంసీలోనూ అంతర్గత కుమ్ములాటలను బీజేపీ క్యాష్ చేసుకుంటోందని అన్నాడు. ఇతర పార్టీల నేతలకు ఎరవేసి లాక్కోవడం, వారికి పదవులు, టికెట్లు, డబ్బు ఆశజూపి పార్టీలోకి ఆకర్షించడం బీజేపీకి వెన్నతోపెట్టిన విద్య అని విమర్శించాడు. మరి, పీకే ఇంత నమ్మకంగా చెబుతున్నాడంటే దీదీ గెలుపు ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక, పీకే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఏరకంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.