భారతదేశ జాతీయ చిహ్నం అన్నంతనే గుర్తుకు వచ్చేది నాలుగు తలల సింహం చిహ్నం. సారనాత్ లోని అశోక చక్రవర్తి చెక్కించిన నాలుగు తలల చిహ్నాన్ని జాతీయ చిహ్నంగా ఎంపిక చేయటం తెలిసిందే. నాలుగు సింహాల తలాటాన్ని సారనాథ్ లోని అశోక స్తంభం నుంచి తీసుకోవటం.. ఇందులోని నాలుగు సింహాలు ఒకదాని వెనుక మరొకటి కూర్చున్నట్లుగా ఉంటాయి. చూసేందుకు మాత్రం మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ సింహాల కింద ఉన్న పీఠం మధ్య భాగంలో అశోకుని ధర్మచక్రం.. చక్రానికి కుడివైపు గుర్రం.. ఎడమవైపు ఎద్దు బొమ్మలు ఉండటం తెలిసిందే. దాని కిందనే సత్యమేవ జయతే అంటూ దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది.
ఇక.. సారనాథ్ స్తూపంపై నిర్మించిన సింహాల ముఖంలో సౌమ్యత.. నియంత్రిత రాజసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. సింహమే అయినా.. ప్రశాంతవదనంతో ఉండటం కనిపిస్తుంటుంది. అయితే.. నూతన పార్లమెంటు భవనంపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై ఇప్పుడు వివాదం రాజుకుంది. జాతీయ చిహ్నంలోని సింహాలకు.. తాజాగా ఆవిష్కరించిన సింహాలకు పోలిక లేదన్నది ప్రధాన ఆరోపణ.
పాత సింహాల్లో శాంతి.. రాజసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తే.. ఇప్పుడు ఆవిష్కరించిన సింహాల్లో కౌర్యం.. కోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. జాతీయ చిహ్నంలోని మార్పులు ఎలా చేస్తారన్న ప్రశ్నల్ని విపక్షాలు సంధిస్తున్నాయి. అయితే.. అధికారపక్ష సభ్యులు మాత్రం సింహాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని.. మామూలుగా ఉన్న సింహాల సైజుతో పోలిస్తే.. కొత్త పార్లమెంటు వద్ద ఏర్పాటు చేసిన జాతీయచిహ్నం సైజు పెద్దదిగా ఉండటం వల్ల అలా కనిపిస్తుందే తప్పించి.. తాము ఎలాంటి మార్పులు చేయలేదని వాదిస్తున్నారు.
నిజానికి రెండు చిహ్నాలకు సంబంధించిన ఫోటోల్ని పక్కపక్కనే పెట్టి చూస్తే.. తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట పలువురి నోటి నుంచి రావటమేకాదు.. సోషల్ మీడియాలోనూ దీనిపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. సారనాథ్ స్థూపంపై ఉన్న సింహంతో పోలిస్తే.. కొత్త పార్లమెంటు భవనం మీద ఆవిష్కరించిన జాతీయ చిహ్నంచాలా పెద్దదని.. దీనికి తోడు కొత్త చిహ్నాన్ని కింద నుంచి చూడటం.. కింద నుంచి పైకి చూసే కోణంలో ఫోటోలు తీయటంతో కోపంతో ఉన్నట్లు కనిపిస్తున్నాయని.. నిజానికి అలా లేవని వాదిస్తున్నారు.
ఈ వివాదంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందిస్తూ.. సారనాథ్ ఎంబ్లెమ్ ను కింది చూస్తే శాంతంగా కనిపిస్తాయా? కోపంగా కనిపిస్తాయా? అని అడిగిన ఆయన.. సారనాథ్ లోని ఎంబ్లెమ్ ఎత్తు 1.6 మీటర్లు అని.. కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన చిహ్నం ఎత్తు 6.5 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు చెబుతున్నారు. ఎత్తు ఎంతన్నది పక్కన పెడితే.. ఎత్తు పెరిగిన కొద్దీ ఎక్స్ ప్రెషన్స్ మారవు కదా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. మిగిలిన వాదనలు ఎలా ఉన్నా.. సారనాథ్ చిహ్నంలో కనిపించే శాంతం.. కొత్తగా ఏర్పాటు చేసిన వాటిల్లో కనిపించకపోవటమే కాదు.. కౌర్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాటే పలువురి నోట వినిపిస్తోంది. అదే సమయంలో మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా వినిపిస్తోంది. సారనాథ్ లోని సింహాలు నోరు మూసుకొని ఉంటే.. తాజాగా ఏర్పాటు చేసిన సింహాల నోరు పెద్దగా తెరిచి ఉన్నట్లు కనిపించటాన్ని ప్రశ్నిస్తున్నారు.
Comments 1