రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఫుల్లుగా బిజీ అయిపోతున్నారు. అప్పుడెప్పుడో బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ ను గెలిపించటంతో మొదలైన ఆయన ప్రస్ధానం మంచి జోరుమీద సాగుతోంది. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సలహాదారుగా నియమితులయ్యారు. నెలకు కేవలం ఒక్క రూపాయి నామమాత్రపు జీతం మీద పీకే పనిచేస్తారని స్వయంగా అమరీందర్ ప్రకటించారు.
వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకే పీకే-అమరీందర్ బృందం కలిసి పనిచేయబోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు పీకే ఏ రాష్ట్రంలో ఎవరికోసం పనిచేసినా తెరవెనుక మాత్రమే పరిమితమయ్యారు. కానీ తాజాగా పీకే నియామకం మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి సలహాదారుగా అపాయింట్ అవ్వటం ఆశ్చర్యంగా ఉంది. క్యాబినెట్ మంత్రి ర్యాంకు కూడా అందుకున్న పీకే కు ప్రభుత్వ సదుపాయాలన్నీ కల్పించబోతున్నట్లు సీఎం చెప్పారు.
ప్రస్తుతం పీకే తమిళనాడులో డీఎంకేతో పాటు పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా వివిధ సర్వే సంస్ధల నివేదికలను బట్టి తమిళనాడు డీఎంకే, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్సే విజయం సాధిస్తాయి. సర్వే ఫలితాలేగనుక నిజమైతే పీకేకి మహర్దశ కంటిన్యు అవుతుందనే అనుకోవాలి. ఎందుకంటే మొదట్లో నితీష్ తో కలిసి పనిచేశారు. తర్వాత ఏకంగా నరేంద్రమోడితో కలిసి పనిచేశారు.
ఆ తర్వాత మోడి, నితీష్ తో వచ్చిన విభేదాల కారణంగా వాళ్ళకు దూరమయ్యారు. తర్వాత పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు పనిచేశారు. పంజాబ్ లో కాంగ్రెస్ విజయం సాధించినా యూపీలో దెబ్బతిన్నది. తర్వాత ఏపిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. ఏ విధంగా చూసినా పీకేకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. అందుకనే పీకేని అమరీంద్ తెరవెనుక నుండి ఏకంగా క్యాబినెట్ ర్యాంకు హోదాతో తెరముందుకు వచ్చేశారు. మొత్తానికి పీకే హవా చాలా జోరుగా సాగుతోందనే చెప్పుకోవాలి.