బంగార్రాజు… ఐదేళ్లుగా చర్చల్లో ఉన్న సినిమా. కానీ ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడుకోవడమే తప్ప.. ఇప్పటిదాకా అది పట్టాలెక్కనే లేదు. వసూళ్ల పరంగా నాగ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయనాలో హైలైట్‌గా నిలిచిన బంగార్రాజు పాత్రను బేస్ చేసుకుని, దాని బ్యాక్ స్టోరీతో సినిమా తీయాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాడు. నాగార్జున సైతం ఈ సినిమా గురించి అప్పుడప్పుడూ చెబుతూనే ఉన్నాడు. కానీ ఎంతకీ ఆ స్క్రిప్టుకు పచ్చజెండా ఊపకపోవడంతో సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.
ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. ఈ మధ్య నాగార్జున ఆ సినిమా గురించి మాట్లాడ్డం మానేశాడు. ఒక దశలో ఈ సినిమా ఉండదేమో అన్న సందేహాలు కలిగాయి. ఐతే బంగార్రాజు కచ్చితంగా ఉటుందని, త్వరలోనే మొదలవుతుందని నాగ్ ఎట్టకేలకు ఒక స్పష్టత ఇచ్చేశాడు.తన కొత్త సినిమా వైల్డ్ డాగ్‌కు సంబంధించిన ప్రెస్ మీట్లో నాగార్జునకు బంగార్రాజు గురించి ప్రశ్న ఎదురైంది. దాని గురించి క్లారిటీ ఇవ్వాలని ఓ విలేకరి అడగ్గా.. నాగ్ సమాధానం చెప్పాడు. ఈ చిత్రాన్ని గత ఏడాదే మొదలుపెట్టి ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నామని.. కానీ కరోనా వల్ల అది సాధ్యపడలేదని నాగ్ చెప్పాడు.
వచ్చే సంక్రాంతికి మాత్రం బంగార్రాజును కచ్చితంగా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నామని.. జూన్-జులై నెలల్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశముందని నాగ్ చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులు నడుస్తున్నాయని.. వచ్చే సంక్రాంతికైనా సినిమా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని నాగ్ తెలిపాడు. ఐతే 2022 సంక్రాంతికి మహేష్ మూవీ సర్కారు వారి పాటతో పాటు పవన్ కళ్యాణ్-క్రిష్ సినిమా కూడా కన్ఫమ్ అయిన నేపథ్యంలో అంత భారీ చిత్రాలకు పోటీగా నాగ్ తన బంగార్రాజును రేసులో నిలుపుతాడా అన్నది సందేహం.