అక్కినేని నాగార్జున కొత్త సినిమా వైల్డ్ డాగ్ రిలీజ్‌కు సంబంధించి కొన్ని నెలలుగా నడుస్తున్న అయోమయానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ మధ్య ప్రచారం జరుగుతున్నట్లే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయింది. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్‌ను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ వాళ్లతో ఇంతకుముందు డైరెక్ట్ రిలీజ్‌కు ఒప్పందం కుదిరిన విషయం అబద్ధమేమీ కాదని కూడా చిత్ర బృందం వెల్లడించింది.
కరోనా నేపథ్యంలో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేద్దామని అనుకున్నామని.. నాగార్జునకు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న గుర్తింపు, అలాగే దేశంలో అన్ని ప్రాంతాల వారూ ఎంజాయ్ చేయగలిగే కంటెంట్ ఉన్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేద్దామని ఓ దశలో నిర్ణయం తీసుకుని మంచి రేటుకు సినిమాను నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మడం నిజమే అని నిర్మాత నిరంజన్ రెడ్డి వెల్లడించారు.ఐతే థియేటర్లు మళ్లీ తెరుచుకుని జనాలు బాగానే థియేటర్లకు వస్తుండటం, విషయం ఉన్న సినిమాలకు మంచి వసూళ్లు వస్తుండటంతో.. నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తేనే బాగుంటుందని పునరాలోచనలో పడ్డట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ వాళ్లతో మాట్లాడామని.. వాళ్లు అంగీకరించడంతో అగ్రిమెంట్‌ను రివైజ్ చేశామని చెప్పాడు. థియేటర్లలో రిలీజైన 40 రోజులకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేలా ఒప్పందం మారిందని, ఆ మేరకు రేటు కూడా తగ్గిందని.. ఈ సినిమా థియేటర్లలో ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నామని.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రేక్షకులు నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా చూస్తారని ఆయనన్నాడు. ఐతే ఏప్రిల్ 2కు ఇప్పటికే రెండు సినిమాలు ఖరారయ్యాయి. గోపీచంద్ సీటీమార్‌తో పాటు.. కార్తి నటించిన తమిళ అనువాద చిత్రం సుల్తాన్ సైతం అదే రోజు రానున్నాయి. మరి వాటితో పోటీ పడి వైల్డ్ డాగ్ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.