ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, నిబంధనలు ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ చలానాలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. తన బైక్ కు 42 వేల రూపాయలు చలానా విధించడంతో ఓ యువకుడు బైక్ ను పోలీసులకు అప్పగించి వెళ్లిపోయిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో ఈ తరహాలో జరిగిన ఓ వింత ఘటన చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ పోలీసులకు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ మహిళ తన మంగళసూత్రాన్ని జరిమానాగా చెల్లించిన వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెళగావిలో దంపతులిద్దరు సిటీ మార్కెట్లో ఫర్నిచర్ కొనేందుకు వెళ్లారు. తమ వెంట తీసుకువెళ్లిన రూ.1800 తీసుకెళ్లారు. రూ.1700 పెట్టి మంచం కొని…మిగిలిన రూ.100తో టిఫిన్ చేయడంతో వారి దగ్గర డబ్బులు అయిపోయాయి.
ఆ తర్వాత బైక్ పై దంపతులిద్దరూ ఇంటికి వెళ్తుండగా హెల్మెట్ లేదన్న కారణంతో వారి బైక్ ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. బండి తాళం తీసుకొన్న ట్రాఫిక్ పోలీసులు రూ.500 చలానా రాశారు. అయితే, తమ దగ్గర డబ్బులు లేవని చెబుతున్నప్పటికీ పోలీసులు వినలేదని బాధితురాలు భారతీ విభూతి చెప్పారు. చలానా కట్టాల్సిందేనని పట్టుబట్టడంతో భారతీ దంపతులు, పోలీసులకు మధ్య 2 గంటలపాటు వాదన జరిగింది.
రోడ్డు మీద జనం గుమిగూడడంతో కోపం వచ్చిన భారతి….తన తాళిబొట్టు తీసి పోలీసులకు ఇచ్చారు. దీనిని తాకట్టు పెట్టి చలానా కట్టాల్సిందిగా చెప్పారు. ఈ తతంగాన్ని అటుగా వెళుతున్న పోలీసు ఉన్నతాధికారులు చూశారు. వారు ఆ దంపతులను ఇంటికి పంపించేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు ఇంకా స్పందించలేదు. ఏది ఏమైనా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.