పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ.. క్షణం తీరిక లేకుండా ఉంటూ కూడా.. తన వరకు వచ్చిన ఆసక్తికర విషయాల్ని ప్రజలకు పంచుకోవటంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనద్ మహీంద్రా ముందు ఉంటారు. విషయం ఏదైనా కావొచ్చు.. దాని మీద తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పే తీరు ఆయనకు ఎక్కువే. సాధారణంగా పారిశ్రామిక దిగ్గజాలు బయటకు వచ్చేందుకు.. వివిధ అంశాల మీద మాట్లాడే విషయంలో ఇష్టపడరు. కానీ.. ఆనంద్ మహీంద్రా మాత్రం అందుకు భిన్నం.తాజాగా ఆయనకు ఒక ఫోటోను చూసినంతనే కోపం వచ్చేసింది.
మాయదారి మహమ్మారి మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధం కావటం.. దీనికి శాంపిల్ అన్నట్లుగా పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ కొత్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటివేళ.. మరింత అప్రమత్తత అవసరం. అందుకుభిన్నంగా ఒక వ్యక్తి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తూ.. మూతికి ఉండాల్సిన మాస్కును కళ్లకు పెట్టుకోవటం కనిపించింది.వెరైటీగా ఉందని భావించారో ఏమో కానీ ఒక వ్యక్తి.. ఈ సీన్ ను ఫోటో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా ఆనంద్ మహీంద్రా వరకు వెళ్లింది. వెంటనే.. ఆయన ఈ ఫోటోను షేర్ చేస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇలాంటి వారి వల్లే కేసులు పెరిగిపోతుంటాయి. ఇలాంటి ప్రయత్నాలు ఏ మాత్రం సరికాదు అంటూ తనకొస్తున్న కోపాన్ని తమాయించుకొని మరీ పోస్టు పెట్టారు.రోటీన్ కు భిన్నంగా ఆగ్రహంతో ఉన్న ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్ గా మారింది. పలువురు ఆయన పోస్టుకు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఆయన ఆగ్రహంలో ధర్మం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర.. కేరళ.. తాజాగా ఢిల్లీలోనూ కేసుల నమోదు అంతకంతకూ ఎక్కకువ అవుతున్నాయి. ఇలాంటివేళ.. ఈ ఫోటోను షేర్ చేయటం ద్వారా చేస్తున్న తప్పులు ఏమిటో అందరికి అర్థమయ్యేలా చేశారని చెప్పక తప్పదు.