రోజులు గడిచే కొద్దీ ‘తానా’ ఎన్నికలలో చాల మంది ఊహిస్తున్నట్టుగానే రసవత్తర పరిణామాలు జరుగుతూ, తరవాతేమిటో అనే ఉత్సుకుతను కలిగిస్తోంది. ఇప్పటివరకూ వరకూ ఒకే కంచంలో తిని, ఒకే దుప్పటి కప్పుకున్నచందంగా కలసి మెలసి వ్యవహారాలు సాగిస్తూ సంస్థను గుప్పిట్లో ఉంచుకున్న ముఖ్య నాయకులందరూ రెండు వర్గాలుగా చీలి కొట్లాడుకోవడం చూపరులకు వినోదం కాక,వెగటు పుట్టిస్తోంది.కొద్ధి సంవత్సరాలుగా అన్ని విషయాలలో సర్దుకుపోతున్న వీరు ప్రస్తుతం మాత్రం పట్టు విడుపులలో పట్టును ఇచ్చి-పుచ్చు కోవడంలో, పుచ్చు కోవడం మాత్రమే చేస్తూ కమ్యూనిటీను విడగొట్టే విధంగాను, సంస్థ బాగోగులను గాలికి వదిలేసే విధంగానూ వ్యవహరించడం వలన ‘తానా’ సభ్యులలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. నామినేషన్ల పర్వం చివరి ఘట్టం సందర్భంగా ఉన్న పరిస్థితి క్రింది విధంగా ఉంది.
‘నమస్తే ఆంధ్ర’ మూడు నెలల ముందే చెప్పినట్లు ‘తానా’ అధ్యక్షపదవి కై ‘గోగినేని’, ‘కొడాలి’ మరియు ‘శృంగవరపు’ మధ్య త్రిముఖ పోటీ ఖరారైంది. ‘కొడాలి’ మరియు ‘శృంగవరపు’ వర్గాలు దాదాపు అన్నిపదవులకు పోటీ పడుతూ మొట్టమొదటి సారిగా ఎన్నికలలో తీవ్రమైన వర్గ రాజకీయాలకు నాంది పలికారు. సీనియర్ నాయకుడైన ‘గోగినేని’మాత్రం ‘తానా’ వంటి అత్యున్నత సేవాసంస్థ లో ప్యానెల్ మరియు వర్గ రాజకీయాలు తగవంటూ, ఏ ప్యానెల్ గెలిచినా ఎన్నికల గాయాలు దీర్ఘకాలం సంస్థను పట్టి పీడిస్తాయంటూ అన్నివర్గాలు, సభ్యులకు అందుబాటుగా అందరివాడినంటూ ఇండిపెండెంట్ గా పోటీ పడ్తున్నారు.
అందరూ చర్చిస్తున్న విషయమైన ‘కొడాలి’ వర్గానికి చెందిన ‘భక్త బల్లా’ సెక్రటరీ పదివి కోసం వేసిన నామినేషన్ చెల్లుబాటు కాదని ఎలక్షన్ కమిషన్ ప్రకటించగా, దానిని నిరసిస్తూ ఇది అక్రమమని అంటూ లీగల్ తలుపు తట్టబోతున్నట్లు ‘భక్త బల్లా’ వర్గ నాయకులు ప్రకటించారు. ఇంకో రెండేళ్లు పదవీకాలం ఉండగా వేరే పదవికి నామినేషన్ వేయడానికి ముందే రాజీనామా చేయని కారణంగా తిరస్కరిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించగా, ఆ విషయాన్ని ‘శృంగవరపు’ వర్గం సమర్థిస్తుండగా, బై-లాస్ ప్రకారం నామినేషన్ పంపే సమయంకాక, ఆమోదానికి ముందు రాజీనామా చేయమని ఉంటె, దానికంటే కొద్దిరోజుల ముందే రాజీనామా చేసి ఆమోదం కూడా పొందానని, ఖచ్చితంగా నామినేషన్ సక్రమమేనని తేలుతుందని ‘నరేన్’ వర్గ నాయకులు చెప్తున్నారు.
బై-లాస్ లో క్రింది విధంగా ఉంది
b) such Trustee, Director or member of the Executive Committee or Foundation resigns prior to accepting nomination for such other office.
అదేవిధంగా ఎవరూ ఊహించని విధంగా చికాగో లో నివసించే అత్యంత సీనియర్ నాయకుడైన ‘హేమ చంద్ర కానూరి’ నామినేషన్ కూడా చెల్లదని ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి కారణంగా ‘హేమచంద్ర’ నామినేషన్ సమర్ధిస్తూ సంతకం చేసిన ఒక మెంబర్షిప్ తమకు తదుపరి అధ్యక్షుడైన ‘అంజయ్య చౌదరి లావు’ ఇచ్చిన ఓటర్ల లిస్టులో లేనందువల్ల తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. అయితే మెంబరు సంతకం తీసుకోకముందే, ‘తానా’ నుంచి వారికి వచ్చిన ఇ-మెయిల్ లో ఉన్న నంబరుతో బై-లాస్ ప్రకారము ‘తానా’ మెంబర్షిప్ సంరక్షకుడు, మేనేజర్ అయిన ‘తానా’ సెక్రెటరీ ‘రవి పొట్లూరి’ ని సంప్రదించగా అది సక్రమమేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ‘నమస్తే ఆంధ్ర’ తో మాట్లాడుతూ ‘రవి పొట్లూరి’ ధ్రువీకరణ చేసినట్లు ఒప్పుకుంటూ, తాను వెరిఫై చేసిన మెంబెర్ డేటాబేస్ నకు, ‘లావు అంజయ్య’ వద్దనున్న ఓటర్ లిస్టునకు వ్యత్యాసం ఉండడం ‘తానా’ వ్యవస్థలో ఉన్న లోపంగా భావించుకోవచ్చన్నారు. ఒక ‘తానా’ మెంబెర్షిప్ వాలిడిటీని సక్రమంగా చెక్ చేసుకునే విధానం ఏర్పరచకుండా, ఎలా నామినేషన్లు ఈ పద్దతి లో సక్రమంగా వేయగలరో ఆ ‘దేముడి’కి ఎరుక అని చాలా మంది వ్యాఖ్యానిస్తుండగా, తనకున్న పరిచయంతో మెంబర్షిప్ పర్యవేక్షకుడితోనే తనకు సంతకం చేసిన వారి వాలిడిటీ వెరిఫై చేసుకున్నందున, అంతకంటే ఎవరూ ఎక్కువ చేయలేని పరిస్థితిలో అయన నామినేషన్ సక్రమమేనని భావించాలని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అన్ని ఆధారాలు సక్రమంగానే ఉన్నందున బోర్డు ఈ విషయమై ఒప్పుకోకపోతే ,తాము ఖచ్చితంగా ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని ‘హేమ కానూరి’ చెప్తున్నారు.
ఒకే నామినేషన్ వచ్చిన సందర్భము లోను, మిగతా నామినేషన్లు రిజెక్ట్ చేసిన సందర్భం లోను రంగం లో మిగిలిన వారిని అభినందిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ కమిషన్ ఇమెయిల్ పంపించడం పట్ల అనేకమంది అభ్యంతరం చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థుతుల్లో నామినేషన్ సక్రమమా కాదా అనేది మాత్రమే చెప్పవలసి ఉండగా, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పడం దానిని అభ్యర్థులు తమకనుకూలంగా ప్రచారంచేసుకోవడం అనేది చాలా అభ్యంతరకరమైనది అనీ, నామినేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు ఇంకా బోర్డు అప్పీల్ మరియు న్యాయ వ్యవస్థ అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ఈ విధంగా ప్రవర్తించడం ఏ విధంగా సమర్ధనీయమని అనేకమంది ప్రశ్నిస్తున్నారు. ఇంకా అనేకమంది నామినేషన్ల విషయమై ఏమి జరిగిందో సమాచారం తెలియవలసి ఉంది. ఇలా నామినేషన్ల ప్రక్రియ జరిగిన విధానం పట్ల అనేకమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తప్పుడు ధ్రువ పత్రాలతో భారీ ఎత్తున జరిగిన సభ్యత్వ ‘అడ్రస్ మార్పు’ల భాగోతము పై ‘తానా’ బోర్డు నియమించిన కమిటీ ఇంతవరకు ఏమీ తేల్చనందున ఈ విషయమై కూడా న్యాయ పోరాటం తప్పని పరిస్థితి కలుగుతోందని, అక్రమాల ప్రయత్నం చాలా స్పష్టంగా ఉన్నందున, వివాదాలకు తావు లేని ఓటర్ లిస్ట్ ఎన్నికల పరమావధి అయినందున న్యాయవ్యవస్థ ద్వారా ఎలక్షన్ ప్రక్రియ ప్రభావితం కావడం తప్పదనీ కూడా తెలుస్తోంది. ‘తానా’ ఎన్నికలలో ఓటరు లిస్ట్ మానిప్యులేషన్లను గత కొద్ధి సంవత్సరాలుగా సాగిస్తూ, వేరే వాళ్లకు అవకాశాలు లేకుండా సంస్థను గుప్పిట్లో పెట్టుకున్న వీరందరూ ఇప్పుడు రెండు వర్గాలుగా కొట్లాడుకోవడంతో బట్ట బయలవుతుందని, చివరకు ఈ విషయం ఒక్కటే,ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని గడబిడ చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
వెరసి ఆదివారం సాయంత్రం వరకు నామినేషన్ల విరమణ సమయం ఉన్నందున ఏమైనా రాజీ చర్చలు జరుగుతాయా, కనీసం లోకల్ పొజిషన్లకైనా పోటీలు మానుతారా, వచ్చేవారం పైన వివరించిన విషయాలపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుందా, చేసుకుంటే ఎన్నికల షెడ్యూల్ పై ఎటువంటి ప్రభావం పడుతుంది అనే విషయమై అమెరికా అంతటా చర్చలు జరుగుతున్నాయి.
మరి చివరగా –“ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరూ,కంచెయే చేను మేసినా కాదనువారెవరూ,తప్పు తప్పని ప్రతిఘటించు వారెవరూ, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ???”