కరోనా కమ్ముకొస్తోంది. మొన్నటివరకు కరోనాను ఖతం పట్టించామన్న ధీమాను వ్యక్తం చేసినోళ్లు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మొన్నటి వరకు కరోనా మహమ్మారిని తరిమికొట్టామన్నది ఉత్త భ్రమ మాత్రమేనని.. వాస్తవం వేరేగా ఉందన్న విషయం గడిచిన వారం రోజులుగా పెరుగుతున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే కేరళ.. మహారాష్ట్రతో పాటు.. మరికొన్ని రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ లోనూ ఫిబ్రవరి రెండో వారంతో పోలిస్తే.. మూడో వారంలో కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దీంతో.. ప్రభుత్వం అలెర్టు అయ్యింది.
మొన్నటివరకు రాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద పట్టింపులు లేనట్లుగా వ్యవహరించిన అధికారులు.. ఇప్పుడు అందుకు భిన్నంగా తనిఖీలు నిర్వమిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్.. అదిలాబాద్ జిల్లాలకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.
పెరుగుతున్న కేసుల నేపథ్యంలో బోధన్ మండలం సాలుర వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి రాష్ట్రలోకి వచ్చే వారికి థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. అదే సమయంలో దగ్గు.. జ్వరం లాంటి లక్షణాలు ఉన్న వారిని ఆసుపత్రికి పంపుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తెలంగాణకు నాలుగు వైపులా ఉన్న సరిహద్దుల్నిఅలెర్టు చేయాల్సిన అవసరం ఉంది. థర్మల్ స్కానింగ్ ఒక్కటే సరిపోదన్నది ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. వేర్వేరు రాష్ట్రాల నుంచి విమాన ప్రయాణాలతో వచ్చే ప్రయాణికులు కూడా కరోనా వాహకులుగా ఉంటారన్నది మర్చిపోకూడదు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వచ్చే వారి ఆరోగ్యం మీద కన్నేయటంతో పాటు.. వారి వివరాల డేటాను సేకరించాల్సిన అవసరం ఉంది.
అంతేకాదు.. రాష్ట్ర సరిహద్దుల గుండా వచ్చే వారి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు మహారాష్ట్ర సరిహద్దుల వద్ద మాత్రమే అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారే తప్పించి.. మిగిలిన సరిహద్దుల్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇది పెద్ద తప్పు అవుతుందన్నది మర్చిపోకూడదు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా.. చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను కరోనా విషయంలో అప్లై చేస్తే మంచిదన్నది కేసీఆర్ సర్కారు గుర్తించాలి.